శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 12 నవంబరు 2024 (21:27 IST)

ఏపీలో గ్రూపు-2 మెయిన్స్ పరీక్షలు వాయిదా

appsc
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూపు-2 మెయిన్స్ పరీక్షలు వాయిదాపడ్డాయి. తొలుత నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం జనవరి 5వ తేదీన గ్రూపు-2 మెయిన్స్ నిర్వహించేలా షెడ్యూల్‌ను విడుదల చేశారు. అయితే, పరీక్షలకు సన్నద్ధం అయ్యేందుకు సమయం సరిపోదని అభ్యర్థులు వాపోయారు. పైగా, ఈ పరీక్షలను వాయిదా వేయాలని పలువురు ఎమ్మెల్సీలు ఏపీపీఎస్సీకి విజ్ఞప్తి చేశారు. దీనిపై సానుకూలంగా ఏపీపీఎస్సీ స్పందించింది. ఈ పరీక్షలను ఫిబ్రవరి 23వ తేదీకి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. 
 
పరీక్ష తేదీ ప్రకటించినప్పటికీ నుంచి పరీక్ష నిర్వహించే తేదీ మధ్య కనీసం 90 రోజుల పాటు సమయం ఉండాలి. అయితే, ఈసారి ఆ సమయం 60 రోజులే ఉండటంతో పరీక్షకు సన్నద్ధం కాలేమని గ్రూపు-2 అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో వారు ఏపీపీఎస్సీ చైర్మన్ అనురాధను కలిసి పరీక్షల నిర్వహణ తేదీని మార్చాలని, పరీక్షకు సన్నద్ధమయ్యేందుకు వీలుగా సమయం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. 
 
మరోవైపు, ఉత్తరాంధ్రకు చెందిన పట్టభద్రుల ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి రావు కూడా ఏపీపీఎస్సీ చైర్మన్‌ను కలిసి ఈ పరీక్షలను మరికొన్ని రోజుల పాటు అంటే అదనంగా 30 రోజుల సమయం ఇవ్వాలని కోరారు. అలాగే, పరువురు ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు కూడా ఇదే తరహా విజ్ఞప్తులు చేశారు. దీంతో ఫిబ్రవరికి వాయిదా వేశారు. కాగా, ఈ సారి గ్రూపు-2 ప్రిలిమ్స్‌కు 4.04 లక్షల మంది హాజరుకాగా, 92 వేల మంది మెయిన్స్‌కు అర్హత సాధించారు.