శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 1 డిశెంబరు 2023 (10:58 IST)

ఓట్ల కోసమే నాగార్జున సాగర్ వివాదం : కేసీఆర్ - జగన్‌ల కుట్ర : పురంధేశ్వరి

purandheswari
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌‍కు కొన్ని గంటల ముందు తెలుగు రాష్ట్రాల సరిహద్దులోని నాగార్జునసాగర్‌ వద్ద నీటి విడుదల అంశాన్ని వివాదాస్పదం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు పురందేశ్వరి వెల్లడించారు. ఇంతకాలం నీటి విడుదల విషయం ప్రభుత్వానికి ఎందుకు గుర్తుకురాలేదని ప్రశ్నించారు. కేవలం ఓట్ల కోసం వివాదం చేసినట్లుగా కనిపిస్తోందన్నారు.
 
విజయవాడలోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో గురువారం 'వికసిత్‌ భారత్‌ సంకల్ప యాత్ర' రథం ప్రారంభ సందర్భంగా పురంధేరి విలేకర్లతో మాట్లాడారు. రాష్ట్రంలో 400 మండలాల్లో కరవు తాండవం చేస్తోంది. అయినా 100 మండలాలనే కరవు ప్రాంతాలుగా ప్రకటించారు. కరవుపై అధికారులు ముందస్తు సమాచారమిచ్చినా.. తగిన చర్యలు తీసుకోకపోవడం రైతులను వంచించడమే. మంత్రివర్గ సమావేశంలో ఇంతవరకూ కరవుపై చర్చ జరగలేదు. రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో బిల్లులు చెల్లించనందువల్లే... ప్రైవేటు ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ కింద చికిత్సలను అందించలేకపోతున్నాయి. భాజపా అధికారంలో లేని రాష్ట్రాల్లో కేంద్ర పథకాలకు రాష్ట్ర ప్రభుత్వాలు స్టిక్కర్లు అంటిస్తున్నాయి. దీన్ని అడ్డుకునేందుకు వికసిత్‌ భారత్‌ సంకల్ప యాత్ర ద్వారా ప్రజలకు కేంద్ర పథకాలపై అవగాహన కల్పిస్తాం అని ఆమె పేర్కొన్నారు. 
 
మరోవైపు, నాగార్జునసాగర్ వద్ద పోలీసు పహారా కొనసాగుతోంది. ముళ్లకంచెల నడుమ సాగర్‌ డ్యామ్‌పై పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఏపీ వైపు భారీగా పోలీసులు మోహరించారు. మరోవైపు తెలంగాణ పోలీసులు కూడా అక్కడికి పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. శుక్రవారం ఇరు రాష్ట్రాలకు చెందిన ఐజీ స్థాయి అధికారులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అంచనా వేసే అవకాశముంది. ఇప్పటికే సుమారు 4 వేల క్యూసెక్కుల నీటిని ఏపీ విడుదల చేసుకుంది. ప్రస్తుతం సాగర్‌లో 522 అడుగుల నీటిమట్టం ఉండగా.. మరో 12 అడుగులకు చేరితే డెడ్‌ స్టోరేజీకి చేరే అవకాశముంది.
 
రాష్ట్ర విభజన సమయంలో కృష్ణా, గోదావరి నదీ బోర్డులు ఏర్పాటయ్యాయి. ఆ సమయంలో శ్రీశైలం జలాశయాన్ని ఆంధ్రప్రదేశ్‌, నాగార్జునసాగర్‌ను తెలంగాణ నిర్వహించాలనే నిర్ణయం వెలువడింది. ఈ నిర్ణయం సరిగా అమలు కాలేదు. శ్రీశైలం జలాశయంలో ఎడమ విద్యుత్తు కేంద్రం, తదితరాలను తెలంగాణ రాష్ట్రమే నిర్వహించుకుంటోంది. అటువైపు ఆంధ్రప్రదేశ్‌ అధికారులను రానివ్వడం లేదు. అదేసమయంలో నాగార్జునసాగర్‌ ప్రాజెక్టులో 26 గేట్లకు 13 గేట్లు ఆంధ్రప్రదేశ్‌ భూభాగంలో ఉంటాయి. 
 
కుడి కాలువ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు నీళ్లు కూడా తెలంగాణ అధికారులే విడుదల చేస్తున్నారు. గతంలో కృష్ణా బోర్డు ఆదేశాలు ఇచ్చినా నీళ్లు విడుదల చేయని సందర్భాలు ఉండేవి. తాజాగా ఇలాంటి సమస్యలేవీ తలెత్తలేదు. ఈ నెలలో సాగర్‌ కుడికాలువ నుంచి నీళ్లు విడుదల చేయాలని తెలంగాణ అధికారులకు ఆంధ్రప్రదేశ్‌ ఇండెంటు పంపిన దాఖలాలూ లేవు. నీటి విడుదలకు ఈ రెండు నెలల్లో ఎలాంటి ఇబ్బందులూ రాలేదు. ఉమ్మడి జలాశయాలను బోర్డుల పరిధిలోకి తీసుకురావాలని ఎప్పటి నుంచో ఆంధ్రప్రదేశ్‌ డిమాండు చేస్తోంది.