శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 15 డిశెంబరు 2024 (10:14 IST)

అల్లు అర్జున్ అరెస్టు : రేవంత్ సర్కారు తొందరపడింది : బొత్స

botsa sattibabu
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందిన కేసులో హీరో అల్లు అర్జున్‌ను బాధ్యుడిని చేసి అరెస్టు చేయడంతో వైకాపా సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్ససత్యనారాయణ మండిపడ్డారు. హీరో అల్లు అర్జున్ అరెస్టు అంశంపై సీఎం రేవంత్ రెడ్డి సర్కారు తొందరపడిందని వ్యాఖ్యానించారు. 
 
సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాటలో మహిళ మృతికి ఒక వ్యక్తిని మాత్రమే బాధ్యుడిని చేసి అరెస్టు చేయడం సరికాదన్న వాదనలు బలంగా వినిపిస్తుండగా, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. 
 
అల్లు అర్జున్‌ను అరెస్టు చేయడం ద్వారా ప్రభుత్వం తొందరపాటు చర్యకు పాల్పడిందన్నారు. గతంలో గోదావరి పుష్కరాల్లో తొక్కిసలాట జరిగి పలువురు చనిపోయారని, ఆ ఘటనకు ఎవర్ని బాధ్యులుగా చేశారని బొత్స ప్రశ్నించారు. సున్నితమైన అంశాల్లో చర్యలు తీసుకునేటప్పుడు ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఆలోచించి అడుగేయాలని హితవు పలికారు. 
 
సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాటలో మహిళ మృతి చెందడం బాధాకరమని, కానీ అధికారంలో ఉన్నవాళ్లు సంయమనం పాటించాలని సూచించారు. ఈ ఘటనలో పోలీసుల వైఫల్యం ఉందని, పోలీసు ఉన్నతాధికారులు కూడా అన్ని కోణాల్లో ఆలోచన చేసి తగిన విధంగా నడుచుకోవాలని భావిస్తున్నట్టు బొత్స తెలిపారు.