మంగళవారం, 11 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 20 నవంబరు 2022 (15:50 IST)

వాడు ఏదో ఓ రోజున అత్యున్నత స్థానానికి చేరుకుంటాడు : చిరంజీవి

chiranjeevi
తన తమ్ముడు పవన్ కళ్యాణ్ ఏదో ఒక రోజున అత్యున్నత స్థానానికి చేరుకుంటాడని మెగాస్టార్ చిరంజీవి నమ్మకం వ్యక్తం చేశారు. హైదరాబాద్ నగరంలోని ఎర్రమనేని నారాయణ మూర్తి కాలేజీ పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 
 
ఇప్పటివరకు తాను అనుకున్నవన్నీ చేశానని చెప్పారు. ముఖ్యంగా, ఒక పని అనుకుంటే అది పూర్తయ్యేంత వరకు వదిలిపెట్టనని అన్నారు. కానీ, ఆ ఒక్క పని (రాజకీయాలు)ని మాత్రం పూర్తి చేయలేక పోయానని చెప్పారు. రాజకీయాలకు తనలాంటి సున్నిత మనస్కులు పనికిరానని చెప్పారు.
 
తనకు కష్టాన్ని ఎదుర్కొనే గుణాన్ని, పనితనాన్ని నేర్పింది ఎన్సీసీ అని తెలిపారు. కాలేజీలో వేసిన నాటకంలో సినిమాల్లోకి వచ్చానని తెలిపారు. అప్పటి నుంచి అనుకున్నదాని అంతు చూడటం నేర్చుకున్నానని వివరించారు.
 
పవన్ కళ్యాణ్ కూడా అనుకున్నది చేసే రకమన్నారు. రాజకీయాలకు పవన్ తగినవాడు అని చెప్పారు. ఏదో ఒకనాడు పవన్ కళ్యాణ్ ఉన్నత స్థాయిలో చూస్తామని ధీమా వ్యక్తం చేశారు. 
 
రాజకీయాల్లో మాటలు పడాల్సి ఉంటుందని, ఒక్కోసారి మనం కూడా మాటలు అనాల్సి ఉంటుందని తెలిపారు. మొరటుగా కటువుగా లేకపోతే రాజకీయాల్లో రాణించలేరని, అందుకే తన లాంటి సున్నిత మనస్కుడికి రాజకీయాలు అవసరమా అని అనుకుని స్వస్తి చెప్పానని తెలిపారు.