శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 11 అక్టోబరు 2024 (11:05 IST)

ఏపీలో రేషన్ కార్డుదారులకు శుభవార్త.. రూ.124కే వంటనూనె

nadendla manohar
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అర్హులైన రేషన్ కార్డుదారులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. శుక్రవారం నుంచి నెలాఖరు వరకూ రేషన్ కార్డుదారులకు తక్కువ ధరకే వంట నూనెను సరఫరా అందించనున్నారు. పామోలిన్ లీటర్ ధర రూ.110లు, సన్‌ఫ్లవర్ ఆయిల్ లీటర్ ధర రూ.124 చొప్పున విక్రయిస్తున్నారు. ఈ మేరకు రాష్ట్ర పౌరసరఫరాల శాఖామంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ఇదే విషయంపై ఆయన వ్యాపారులతో జరిపిన చర్చలు సఫలం కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా తక్కువ ధరకే వంట నూనెలను అందించనున్నారు. 
 
ప్రస్తుతం రాష్ట్రంలో వంట నూనె ధరలు, కిరాణా సరకుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. దీంతో వినియోగదారులపై తీవ్రమైన ఆర్థికభారం పడటంతో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో వంట నూనె ధరల తగ్గింపునకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గురువారం విజయవాడలోని పౌరసరఫరాల శాఖ కార్యాలయంలో మంంత్రి నాదెండ్ల మనోహర్ ధరల పెరుగుదలపై సమీక్ష నిర్వహించారు. వంట నూనెల సరఫరాదారులు, చాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులు, వర్తక సంఘాల ప్రతినిధులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. 
 
ఇండోనేషియా, మలేషియా, ఉక్రెయిన్ నుంచి దిగుమతులు తగ్గడంతో పాటు పన్నులు, ప్యాకేజీ ఖర్చులు పెరగడంతో ధరలు పెరిగాయని వ్యాపారులు మంత్రికి తెలిపారు. వేర్వేరు ప్రాంతాల్లో వేర్వేరు ధరలు కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఒకే ధరపై వంట నూనెలు విక్రయంచాలని మంత్రి మనోహర్ వారికి సూచించారు. దీంతో శుక్రవారం నుంచి నెలాఖరు వరకు రాష్ట్ర వ్యాప్తంగా పామోలిన్ రూ.110, సన్ ఫ్లవర్ ఆయిల్ రూ.124 చొప్పున విక్రయించనున్నట్టు మంత్రి మనోహర్ తెలిపారు. ఒక్కో రేషన్ కార్డుపై మూడు లీటర్ల పామోలిన్, ఒక లీటర్ సన్ ఫ్లవర్ అయిల్‌ చొప్పున నిర్ణయించిన ధరలపై అందించనున్నట్టు ఆయన వెల్లడించారు.