తూగో జిల్లాలో బర్డ్ ఫ్లూ... భారీగా కోళ్లు మృతి.. కోడిమాంసం తినొద్దంటున్న అధికారులు..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లాలో బర్డ్ ఫ్లూ విస్తృతంగా వ్యాపిస్తుంది. దీంతో వందలాది కోళ్లు మృత్యువాతపడుతున్నాయి. పలు కోళ్ళఫారంల నుంచి సేకరించిన శాంపిల్స్‌ను పరీక్షించగా ఈ జిల్లాలో బర్డ్ ఫ్లూ అధికంగా ఉన్నట్టు అధికారులు నిర్దారించారు. దీంతో కోడిమాంసం ఆరగించవద్దని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.
జిల్లాలో బర్డ్ ఫ్లూ వ్యాపిస్తుందని, అందువల్లే కోళ్లు పెద్ద సంఖ్యలో చనిపోతున్నాయని అధికారులు తెలిపారు. ఈ కారణంగా కొన్ని రోజుల పాటు ప్రజలు చికెన్‌కు దూరంగా ఉండాలని సూచించారు. చికెన్ వినియోగం తగ్గించాలని కోరారు.
తూర్పు గోదావరి జిల్లాలో కోళ్లు చనిపోతుండటంతో అధికారులు పలు గ్రామాల్లో కోళ్లఫారంల నుంచి శాంపిల్స్ సేకరించారు. కానూరు గ్రామంలోని కోళ్లఫారం నుంచి సేకరించిన శాంపిల్స్‌లో బర్డ్ ఫ్లూ నిర్ధారణ అయింది. బర్డ్ ఫ్లూ కలకలం నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం కంట్రోల్ రూం ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించి వివరాలు తెలుసుకునేందుకు వీలుగా 954209 08025 అనే ఫోన్ నంబరులో సంప్రదించాలని అధికారులు సూచించారు.