1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 28 మార్చి 2025 (15:16 IST)

గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసు : వల్లభనేని వంశీకి మళ్లీ నిరాశ

Vallabhaneni Vamsi
విజయవాడ గన్నవరంలోని టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడి కేసులో వైకాపా నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి సీఐడీ కోర్టులో మరోమారు చుక్కెదురైంది. వంశీకి వచ్చే నెల 9వ తేదీ వరకు రిమాండ్ పొడగించింది. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో నేటితో రిమాండ్ ముగియడంతో వంశీని శుక్రవారం ఉదయం జిల్లా జైలు నుంచి గన్నవరం పోలీసులు కోర్టుకు తీసుకొచ్చారు. వంశీతో పాటు మరో నిందితుడు నిమ్మ లక్ష్మీపతిని కూడా పోలీసులు ప్రత్యక్షంగా కోర్టులో హాజరుపరిచారు.
 
ఇరు వర్గాల వాదనలు ఆలకించిన తర్వాత ఈ కేసులో వంశీకి ఏప్రిల్ 9వ తేదీ వరకు సీఐడీ కోర్టు రిమాండ్ పొడగిస్తూ ఆదేశాలు జారీచేసింది. సీఐడీ కోర్టు రిమాండ్‌ను పొడగించడంతో ఆయనను విజయవాడ జైలుకు తరలించారు. మరోవైపు, సత్యవర్థన్ కిడ్నాప్ కేసులో వంశీ రిమాండ్ ఖైదీగా విజయవాడ జైలులో ఉన్న విషయం తెల్సిందే. 
 
ఇక సత్యవర్థన్ కిడ్నాప్ కేసుకు సంబంధించి విజయవాడ ఎస్పీ, ఎస్టీ కోర్టులో ఇప్పటికే వాదనలు ముగిశాయి. వంశీకి బెయిల్ పిటిషన్‌‍పై శుక్రవారం సాయంత్రానికి తీర్పు వెలువడే అవకాశాలు ఉన్నాయి. ఈ కోర్టులో కూడా వంశీకి బెయిల్ లభిస్తుందా లేదా అన్నది సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కాగా, ఈ బెయిల్ పిటిషన్‌పై తీర్పు శుక్రవారం సాయంత్రం 4 గంటల తర్వాత వెలువడనుంది.