వైద్య విద్యార్థినిలు దుస్తులు మార్చుకుంటుండగా వీడియో తీసిన మేల్ నర్స్
గుంటూరు నగర శివారులోని ఓ ప్రైవేట్ వైద్య కాలేజీ ఆస్పత్రిలో పని చేసే మేల్ నర్స్ ఒకరు పాడుపనికి పాల్పడ్డాడు. మహిళా వైద్యులు, వైద్య విద్యార్థినిలు దుస్తులు మార్చుకుండగా, వారిని వీడియో తీశాడు. దీన్ని గమనించిన కొందరు వైద్య విద్యార్థులు పత్తిపాడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి ఆ మేల్ నర్స్‌ను అరెస్టు చేశారు. అలాగే, అతని ఫోనును స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించాడు.
ఈ కేసు వివరాలను డీఎస్పీ భానోదయ వివరిస్తూ, 'నెల రోజుల క్రితం వెంకటసాయి అనే వ్యక్తి ఈ ఆసుపత్రిలో మేల్ నర్స్‌గా చేరాడు. ఆపరేషన్ థియేటర్లో మహిళా వైద్యులు, పీజీ విద్యార్థినులు దుస్తులు మార్చుకుంటుండగా అతను ఫోన్‌తో వీడియోలు తీశాడని ఫిర్యాదు అందడంతో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
అతడి ఫోనులోని వీడియోలను అప్పటికే మహిళా వైద్యులు డిలీట్ చేశారు. ఆ డేటాను తిరిగి పొందేందుకు చర్యలు తీసుకుంటున్నాం. నిందితుడి ఫోనులో 200కు పైగా వీడియోలు ఉన్నట్టు వైరల్ అవుతున్న విషయం తెలిసింది. కానీ దానికి ఆధారాల్లేవు' అని డీఎస్పీ తెలిపారు. అయితే, మేల్ నర్స్ ఈ పాడుపనిని ఆస్పత్రిలోనే చేశాడా.. బయటకూడా చేశాడా అనేదానిపై విచారణ జరుపుతున్నామని చెప్పారు.