శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 12 డిశెంబరు 2024 (15:22 IST)

తిరుమలలో కుంభవృష్టి.. ఏరులై పారుతున్న వర్షపునీరు (Video)

rain
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావం కారణంగా తిరుమలలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. భారీ వర్షాల నేపథ్యంలో శ్రీవారి మాడ వీధులతో పాటు లోతట్టు ప్రాంతాలన్నీ పూర్తిగా జలమయమయ్యాయి. ఘాట్ రోడ్డులో కొండచరియలు జారీ పడే ప్రాంతాల్లో అధికారులు నిఘా పెంచారు. వాహనదారులు ఘాట్ రోడ్లపై ప్రయాణించే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకుని నెమ్మదిగా వాహనాలు నడపాలని సూచించారు. పాపవినాశనం, శ్రీవారి పాదాలకు వెళ్లే మార్గాలను తాత్కాలికంగా మూసివేశారు. పాపవినాశనం, గోగర్భం వర్షం కారణంగా పూర్తిగా నిండిపోయి నీరు ప్రవహిస్తుంది. 
 
ఇక భారీ వర్షం కారణంగా చలి తీవ్రత కూడా తిరుమలలో ఒక్కసారిగా పెరిగిపోయింది. భారీ వర్షంతో తిరుపతి వీధులు జలమయమయ్యాయి. వెస్ట్ చర్చి కూడలిలో రైల్వే అండర్ బ్రిడ్జి వర్షపు నీటితో నిండిపోయింది. అధికారులు వాహనరాకపోకలను దారి మళ్లించారు. బాలాజీ కాలనీ నుంచి మహిళా యూనివర్శిటీ మీదుగా వాహనాలను మళ్లించారు. 
 
కపిలతీర్థం పుష్కరిణికి భక్తులు వెళ్లకుండా తితిదే అధికారులు నిలిపివేశారు. తిరుపతిలో మాల్వాడిగుండం జలపాతం పొంగిపొర్లుతుంది. అటు లక్ష్మీపురం కూడలి, గొల్లవాని గుంటలోని లోతట్టు ప్రాంతాల్లో భారీగా వరద నీరు ప్రవహిస్తుంది.