బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీకి భారీ వర్ష ముప్పు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భారీ వర్ష ముప్పు పొంచివుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావం కారణంగా రాష్ట్రంలో రానున్న ఐదు రోజుల పాటు విస్తారంగా భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. మున్ముందు ఇది మరింత బలపడి తుఫానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. దీంతో కోస్తాంధ్ర ప్రజలతో పాటు అధికార యంత్రాంగం మరింత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
దక్షిణ అండమాన్ సముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం కారణంగా మంగళవారం నాటికి అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడనుంది. ఇది రాబోయే 48 గంటల్లో పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణిస్తూ వాయుగుండంగా బలపడనుంది. అనంతరం దక్షిణ కోస్తా, ఉత్తర తమిళనాడు మధ్య తీరాన్ని సమీపించే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. దీని ప్రభావం ముఖ్యంగా రాష్ట్రంలోని కోస్తా జిల్లాలపై అధికంగా ఉంటుందని పేర్కొంది.
ఈ వాతావరణ మార్పుల నేపథ్యంలో బంగాళాఖాతం నుంచి వీస్తున్న తూర్పు గాలుల కారణంగా ఆదివారం నుంచే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురవడంతో రోడ్లు, లోతట్టు ప్రాంతాలు నీటితో నిండిపోయి జనజీవనానికి అంతరాయం కలిగింది. నెల్లూరులో 4.9 సెం.మీ., విజయనగరం జిల్లా గొల్లపాడులో 4.3 సెం.మీ. వర్షపాతం నమోదైంది.
ఈ అల్పపీడనం ప్రభావం కారణంగా వచ్చే ఐదు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. సోమ, మంగళవారాల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు, బుధవారం నుంచి శుక్రవారం వరకు శ్రీకాకుళం నుంచి తిరుపతి వరకు పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.
అదేసమయంలో విపత్తుల నిర్వహణ సంస్థ కూడా జిల్లాల వారీగా హెచ్చరికలు జారీ చేసింది. సోమవారం బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో, మంగళవారం పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని తెలిపింది. పంట నష్టం జరగకుండా రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.