శుక్రవారం, 14 మార్చి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 14 మార్చి 2025 (17:16 IST)

జనసంద్రంగా మారిన పిఠాపురం... జయకేతనం సభ ప్రారంభం!!

jana sena party
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గం పిఠాపురం జనసంద్రమైంది. ఆ పార్టీ 12వ ఆవిర్భావ వేడుకలు కాకినాడ జిల్లా పిఠాపురంలో శుక్రవారం నిర్వహిస్తున్న విషయం తెల్సిందే. ఇందుకోసం జనసేన శ్రేణులు రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి కూడా భారీగా తరలివచ్చారు. దీంతో పిఠాపురంలో ఎటు చూసినా జనసేన కార్యకర్తలే కనిపిస్తున్నారు. 
 
పవన్ కళ్యాణ్ తొలిసారి ఎమ్మెల్యేగా నెగ్గిన అసెంబ్లీ స్థానంగా పిఠాపురం నియోజకవర్గం సభకు ఆతిథ్యమిస్తుంది. దీంతో ఈ ప్రాంతం ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకుంది. పైగా గత సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసిన 21 అసెంబ్లీ, 2 లోక్‌సభ స్థానాల్లో గెలుపొందింది. దీంతో ఈ సభకు జయకేతనం అనే పేరు పెట్టారు. 
 
ఈ సభకు స్వాగత మార్గాలను కొబ్బరి ఆకులు, ఫెక్సీలు, జెండాలతో నింపేశారు. వివిధ నియోజకవర్గాల నుంచి జనసైనికులు కార్లు, బస్సులు, లారీలు, ట్రాక్టర్లు, ద్విచక్రవాహనాల్లో తరలివస్తుండటంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్య తలెత్తింది. ఈ వాహనాల పార్కింగ్ కోసం ఆరు చోట్ల పార్కింగ్ ప్రాంగణాలు ఏర్పాటు చేశారు. 
 
అలాగే, నాలుగు చోట్ల భోజన వసతులు, ఎక్కడికక్కడ చలివేంద్రాలు, ఏడు చోట్ల వైద్య శిబిరాలు, 14 అంబులెన్స్‌లను సిద్ధంగా ఉంచారు. ఈ సభకు 1700 మంది పోలీసులతో పాటు 500 మంది జనసేన వాలంటీర్లతో భత్రత ఏర్పాటు చేశారు.