శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Updated : గురువారం, 31 అక్టోబరు 2024 (15:30 IST)

కర్నాటక ప్రభుత్వం ఉచిత బస్ పథకం ఆపేస్తోంది, మరి చంద్రబాబు ప్రారంభిస్తారా?

Free Bus
ఎన్నికలలో ఓటర్లను ఆకర్షించేందుకు ఆయా రాజకీయ పార్టీలు పలు తాయిలాలు ప్రకటిస్తుంటాయి. ఐతే ఇటీవలి కాలంలో ఈ ఉచిత పథకాల వల్ల అభివృద్ధికి గండిపడుతోందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఉచిత పథకాలు అనేవి అస్సలు ఇవ్వరాదనీ, అభివృద్ధికి ఆ నిధులను వెచ్చిస్తే ప్రతి ఒక్కరికి పని దొరుకుతుందని చెబుతున్నారు.
 
ఇక అసలు విషయానికి వస్తే... కర్నాటక ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత బస్సు పథకాన్ని రద్దు చేసే దిశగా అడుగులు వేస్తోంది. గత ఎన్నికల్లో 5 గ్యారెంటీలు అంటూ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ... ఉచిత పథకాలను అమలు చేసేందుకు నానా తంటాలు పడుతోంది. ఇందులో మహిళలకు ఉచిత బస్సు వుంది. ఐతే ఈ పథకం ప్రారంభించి ఏడాదిన్నర అవుతుండగా దీనివల్ల ప్రభుత్వం పైన 7 వేల కోట్ల రూపాయలుకు పైగా భారం పడింది. ఇతర పథకాల వల్ల కూడా ఇదే జరుగుతోంది. దీనితో ఎక్కడి అభివృద్ధి పనులు అక్కడే ఆగిపోయాయి.
 
ఉచిత పథకాలు అభివృద్ధికి గుదిబండల్లా మారుతున్నాయని గ్రహించిన సిద్ధరామయ్య సర్కార్ వీటికి క్రమంగా మంగళం పాడేయాలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఉప ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్ మాట్లాడుతూ... ఉచిత బస్సు సౌకర్యం తమకు అవసరం లేదని మహిళలే చెబుతున్నారనీ, తాము టిక్కెట్లు కొనుక్కుని బస్సుల్లో ప్రయాణిస్తామని అంటున్నట్లు చెప్పారు. దీనితో ఇక ఈ పథకం ఎత్తివేసే రోజులు ఇంక ఎంతో దూరంలో లేనట్లు అర్థమవుతుంది.
 
ఇదిలావుంటే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు కూడా సూపర్ 6 ఉచిత హామీలు ఇచ్చారు. వీటిలో ఒకటి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం. మరి కర్నాటక తిప్పలు చూశాక ఈ పథకాన్ని చంద్రబాబు నాయుడు ప్రారంభిస్తారా లేదా అన్నది వేచి చూడాల్సి వుంది.