గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 25 నవంబరు 2024 (13:42 IST)

మా ఇల్లు బఫర్‍‌జోన్‌లో ఉందా... హైడ్రా కమిషనర్ క్లారిటీ!!

ranganath
హైదరాబాద్ నగరంలోని హైడ్రా కమిషనర్ రంగనాథ్ మధురానగర్‌లో నివాసం ఉంటున్న ఇల్లు కూడా బఫర్ జోనులోకి వస్తుందంటూ సోషల్ మీడియాలో ఓ వార్త విస్తృతంగా ప్రచారం సాగుతుంది. హైడ్రా ఆధ్వర్యంలో బఫర్ జోన్ పరిధిలోని అక్రమ నిర్మాణాలను నిర్దాక్షిణ్యంగా, మొహమాటానికి తావు లేకుండా పెద్దా, చిన్నా అనే తేడా లేకుండా కూల్చి వేస్తున్న క్రమంలో తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ సొంత ఒకప్పటి పెద్ద చెరువు బఫర్ జోన్ పరిధిలోనే ఉందంటూ ప్రచారం జరుగుతోంది. 
 
ఈ నేపథ్యంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆ వార్తలపై క్లారిటీ ఇచ్చారు. తన ఇల్లు బఫర్ జోనులో ఉందంటూ వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో వాస్తవం లేదన్నారు. మధురానగర్ లో 44 ఏళ్ల క్రితం మా తండ్రిగారైన ఏపీవీ సుబ్బయ్య నిర్మించారని, ఆ ఇంట్లోనే తాము ఉంటున్నామని, ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు కొందరు దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. ఒకప్పటి పెద్ద చెరువునే 25 ఏళ్ల క్రితం కృష్ణకాంత్ పార్క్ మార్చారన్నారు. కృష్ణకాంత్ పార్క్‌‍ మా ఇంటికి మధ్య వేలాది ఇళ్లు ఉన్నాయన్నారు. చెరువు కట్ట దిగువన పది మీటర్లు దాటితే బఫర్ జోన్ పరిధిలోకి రావని స్పష్టంచేశారు.
 
సంస్కృతి, సంప్రదాయాలలో భాగంగా చెరువు కట్ట మీద కట్టను ఆనుకుని కట్ట మైసమ్మ ఆలయాలు నిర్మిస్తారనే విషయం అందరికీ తెలిసిందేనని అన్నారు. తాము నివాసం ఉంటున్న ఇంటికి ఒక కిలోమీటరు దూరంలో కట్ట మైసమ్మ గుడి ఉందన్నారు. తమ ఇల్లు చెరువు కట్టకు దాదాపు కిలోమీటరు దూరంలో ఉందన్నారు. తాము ఉంటున్న ఇల్లు బఫర్ జోన్‌లో లేదు అనేది వాస్తవమని అందరూ గ్రహించాలని కోరారు. అంతేకాకుండా ఇందుకు సంబంధించిన ఫొటోలు కూడా పరిశీలించాలని కోరుతూ ఫొటోలు కూడా రంగనాథ్ విడుదల చేశారు.