శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 28 నవంబరు 2024 (15:12 IST)

ఢిల్లీలో పవన్ కళ్యాణ్ మంతనాలు .. రాజ్యసభకు మెగా బ్రదర్!!

Nagababu
ఢిల్లీ పర్యటనలో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రధాని నరేంద్ర మోడీతో పాటు పలువురు కేంద్ర మంత్రులను కలిశారు. ఈ సందర్భంగా ఆయన కీలక మంతనాలు జరిపినట్టు తెలుస్తుంది. ఏపీ నుంచి మూడు రాజ్యసభ స్థానాలు ఖాళీ అయ్యాయి. వీటిలో ఒకదాన్ని తమ అన్న, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి, సినీ నటుడు నాగబాబుకు ఇచ్చేలా బీజేపీ పెద్దలను ఒప్పించినట్టు సమాచారం. దీంతో మెగా బ్రదర్ నాగబాబు రాజ్యసభ సభ్యుడుగా పెద్దల సభలో అడుగుపెట్టే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. 
 
ఏపీ నుంచి రాజ్యసభకు ప్రాతినిథ్యం వహిస్తూ వచ్చిన వైకాపాకు చెందిన ముగ్గురు రాజ్యసభ సభ్యులైన మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తాన్ రావు, ఆర్.కృష్ణయ్యలు తమ సభ్యత్వాలకు వేర్వేరు కారణాలతో రాజీనామా చేయడంతో ఈ ఖాళీలు ఏర్పడ్డాయి. వీటికి త్వరలోనే ఎన్నికలు జరుగనున్నాయి. 
 
ఈ నేపథ్యంలో జనసేన నుంచి నాగబాబును పెద్దల సభకు పంపాలని నిర్ణయించినట్టు తెలిసింది. పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనలో ఉన్నపుడే ఈ విషయంపై స్పష్టత వచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. కాగా, ఈ రాజ్యసభ ఎన్నికల కోసం వచ్చే నెల మూడో తేదీ నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమై పదో తేదీన ముగుస్తుంది. 13వ తేదీన నామినేషన్లు ఉపసంహరించుకోవచ్చు. 20వ తేదీన పోలింగ్ నిర్వహించి, అదే రోజున ఫలితాలను వెల్లడిస్తారు. 
 
అయితే, ప్రస్తుతం ఏపీలో టీడీపీ సారథ్యంలోని కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయి మెజార్టీతో అధికారంలో ఉండటంతో ఈ మూడు స్థానాలు కూటమి అభ్యర్థులకు దక్కడం ఖాయంగా తెలుస్తుంది. ఒక అభ్యర్థి రాజ్యసభకు ఎన్నిక కావాలంటే కనీసం 25 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. వైకాపా కేవలం 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. ఈ లెక్కన ఆ పార్టీ బరిలో నిలిచే అవకాశమే లేదు. సో.. కూటమి తరపున పోటీ చేసే ముగ్గురు అభ్యర్థులు ఈ ఎన్నికల్లో గెలుపొందటం ఖాయంగా కనిపిస్తుంది.