గురువారం, 13 నవంబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 11 నవంబరు 2025 (22:48 IST)

దేశంలో సనాతన ధర్మ పరిరక్షణ బోర్డుకు సమయం ఆసన్నమైంది : పవన్ కళ్యాణ్

pawan kalyan
దేశంలో సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటుకు సమయం ఆసన్నమైందని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. తిరుమల ప్రసాదాల తయారీలో కల్తీ నెయ్యి వినియోగంపై సిట్ నివేదిక వచ్చిన నేపథ్యంలో ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు. 
 
గత ప్రభుత్వంలో తితిదే బోర్డు వైఫల్యాలు, అనైతిక చర్యలు భక్తుల హృదయాలను తీవ్రంగా కలచివేశాయన్నారు. తిరుమల పవిత్రతను కలుషితం చేసిన వ్యవహారాల్ని ప్రస్తుతం ఉన్న బోర్డు.. ఒక పాఠంగా తీసుకోవాలన్నారు. భక్తుల విశ్వాసాన్ని తిరిగి పొందేందుకు నిరంతరం కృషి చేయాలని సూచించారు. 
 
తితిదే బోర్డు సభ్యులు, అధికారులు, ఉద్యోగులు, కాంట్రాక్టర్లు, సరఫరాదారులు ఎవరైనా ఒక పదవి లేదా హోదా మాదిరిగా కాకుండా... కోట్లాది మంది భక్తులకు దైవ సేవ చేసే అవకాశంగా భావించాలన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం కార్యకలాపాలన్నీ పూర్తిగా పారదర్శకంగా నిర్వహించాలన్నారు.
 
జమా ఖర్చులు, ఆదాయం, ఆడిట్‌, నాణ్యతా ప్రమాణాలు పాటించటం వంటి వివరాలు ప్రజలకు అందుబాటులో ఉంచాలని సూచించారు. ప్రపంచమంతటా ఉన్న హిందూ సమాజానికి తిరుమల తిరుపతి దేవస్థానం కేవలం యాత్రా కేంద్రం కాదని.. పవిత్రమైన ఆధ్యాత్మిక ప్రయాణమని అభిప్రాయపడ్డారు. 
 
తిరుపతి లడ్డు కేవలం మిఠాయి కాదు..  మనందరి విశ్వాసానికి ప్రతీకగా అభివర్ణించారు. అందరి నమ్మకాన్ని, గాఢమైన భక్తిని ప్రతిబింబిస్తుంది కాబట్టే లడ్డూ ప్రసాదాన్ని స్నేహితులు, కుటుంబ సభ్యులందరికీ పంచుతామని పేర్కొన్నారు. ఏటా సగటున 2.5 కోట్ల మంది భక్తులు తిరుమలకు వస్తున్నారని, ఎవరైనా అక్కడి ఆచారాల్ని హేళన  చేస్తే ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తుల నమ్మకాన్ని దెబ్బతీస్తుందన్నారు. 
 
మన విశ్వాసానికి గౌరవం, రక్షణ తప్పనిసరి అని చెప్పారు. సనాతన ధర్మం అనేది ప్రపంచంలోనే ప్రాచీనమైనదని... అదేవిధంగా నిరంతరం అభివృద్ధి చెందుతున్న నాగరికత అని వ్యాఖ్యానించారు. అన్ని వర్గాల సమ్మతితో సనాతన ధర్మ పరిరక్షణ బోర్డును ఏర్పాటు చేయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ధర్మాన్ని కాపాడటం ప్రతి సనాతనుడి బాధ్యత అని స్పష్టం చేశారు.