మీరు కోట్లాది మందికి మార్గదర్శకుడిగా ఉండాలి : ఇట్లు.. మీ తమ్ముడు
తనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన తన అన్నయ్య చిరంజీవికి ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ధన్యవాదాలు తెలిపారు. తనతో పాటు కోట్లాది మందికి మార్గదర్శకుడుగా నిలవాలని కాంక్షిస్తున్నాను అని పేర్కొన్నారు. 'నా జీవితానికి మార్గదర్శి, తండ్రి సమానులైన అన్నయ్య, పద్మ విభూషణ్ చిరంజీవికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మీ ఆశీస్సులు, ప్రేమాభిమానాలు, పుట్టిన రోజు శుభాకాంక్షలు ఎంతో ఆనందం కలిగించాయి. సమాజానికి ఏదైనా చేయాలని, మీరు నేర్పిన సేవా గుణమే ఈ రోజున జనసేన పార్టీ ద్వారా ప్రజలకు సేవ చేసేందుకు స్ఫూర్తినిచ్చింది. మీరు సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని, ఎల్లపుడూ నాతో పాటుగా కోట్లాది మందికి మార్గదర్శకుడిగా నిలవాలని ఆకాంక్షిస్తున్నాను.. మీ తమ్ముడు" అంటూ ట్వీట్ చేశారు.
దీర్ఘాయుష్మా భవ.. తమ్ముడికి అన్నయ్య బర్త్ డే విషెస్
తన తమ్ముడు, ఏపీ ఉప ముఖ్యమంత్రి, సినీ హీరో, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌కు అన్నయ్య, మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. సెప్టెంబరు 2వ తేదీన పవన్ కళ్యాణ తన బర్త్ డే వేడుకలను జరుపుకుంటున్న విషయం తెల్సిందే. దీంతో చిత్రపరిశ్రమకు చెందిన అనేక మంది ప్రముఖులు, ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలో చిరంజీవి కూడా తన ఎక్స్ వేదికగా బర్త్ డే శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు.
"చనలచిత్ర రంగంలో అగ్రనటుడుగా, ప్రజా జీవితంలో జనసేనానిగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రజలకు నిరంతర సేవలందిస్తున్న కళ్యాణ్ బాబుకి జన్మదిన శుభాకాంక్షలు. ప్రజా సేవలో నువ్వు చూపుతున్న అంకితభావం చిరస్మరణీయం. ప్రజలందరి ఆశీస్సులతో, అభిమానంతో నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ప్రజలకు మార్గదర్శకుడిగా నిలవాలని ఆశీర్వదిస్తున్నాను. దీర్ఘాషుష్మాన్ భవ పవన్ కళ్యాణ్" అంటూ పేర్కొన్నారు.