శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 31 ఆగస్టు 2024 (09:48 IST)

ఏపీలో సామాజిక పింఛన్ల పండుగ : ఒక రోజు ముందుగానే అందజేత

pension money
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సామాజిక పింఛన్ల కార్యక్రమంలో ఒక రోజు ముందుగానే ప్రారంభించారు. సెప్టెంబరు ఒకటో తేదీన ఆదివారం రావడంతో ఒక రోజు ముందుగా అంటే ఆగస్టు 31వ తేదీ శనివారం ఉదయం ఆరు గంటల నుంచే పింఛన్లను పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. దీంతో ప్రభుత్వ యంత్రాంగం కూడా అందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేసి, శనివారం ఉదయం ఆరు గంటల నుంచి ఈ పింఛన్ల పంపిణీ ప్రారంభించారు. 
 
ఒకప్పుడు వైసీపీ ప్రభుత్వం నెల వచ్చి రోజులు గడుస్తున్నా పంపిణీ చేసే పరిస్థితి ఉండేది కాదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పక్కాగా ఒకటో తారీఖు లేదంటే ఒకరోజు ముందుగానే పింఛన్లను పంపిణీ చేస్తున్నారు. ఈ క్రమంలోనే సెప్టెంబరు నెల పింఛన్లను ఒకరోజు ముందుగానే పంపిణీ చేస్తుండటంతో పింఛన్‌దారులు ఆనందంగా ఉన్నారు. సెప్టెంబరు ఒకటో తేదీ ఆదివారం కావడం, ఆ రోజు ప్రభుత్వ ఉద్యోగులకు సెలవు దినం కావడంతో సీఎం చంద్రబాబు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఉద్యోగుల సెలవుకు భంగం కలగకుండా, పెన్షన్‌దారులకు నగదు అందడం కోసం ఒకరోజు ఆలస్యం కాకుండా చర్యలు తీసుకున్నారు. 
 
మరోవైపు, రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ పంపిణి కార్యక్రమం శనివారం తెల్లవారుజాము నుంచే లబ్దిదారులకు అధికారులు పింఛన్లను పంపిణీ చేస్తున్నారు. గత ప్రభుత్వంలో పెన్షన్ కోసం ఎదురు చూసే పరిస్థితి నుంచి ఒక రోజు ముందుగానే తలుపు తట్టి పెన్షన్ ఇస్తున్నామని ప్రభుత్వం గర్వంగా చెబుతోంది. శనివారం సాయంత్రానికి పింఛన్ల పంపిణీని పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం జరిగింది. 
 
అయితే, తూర్పు గోదావరి జిల్లా సీతానగరం మండలం సింగవరంలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. సింగవరం సర్పంచ్, టీడీపీ నాయకుడు సంగన చిన పోశయ్య శుక్రవారం పింఛన్ల పంపిణీపై గ్రామమంతా తిరిగి ప్రచారం చేశారు. సైకిల్‌ తొక్కుతూ ఓ చేతిలో మైక్‌ పట్టుకొని 'శనివారం పింఛను తీసుకునే వాళ్లంతా ఇళ్ల వద్దే ఉండాలి' అంటూ చెప్పుకొంటూ గ్రామమంతా చుట్టేశారు. వాస్తవానికి దండోరా వేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని.. ఆటో పెట్టి ప్రచారం చేసేంత స్తోమత లేదని పేర్కొన్నారు. దీనికి కారణం గత వైసీపీ ప్రభుత్వం పంచాయతీ ఖజానాను ఖాళీ చేసిందని ఆయన గుర్తు చేశారు.