గురువారం, 13 నవంబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 11 నవంబరు 2025 (12:17 IST)

తాడిపత్రిలో వైకాపా నేత ఆర్సీ ఓబుల్ రెడ్డిపై దాడి - ఉద్రిక్తత

crime scene
అనంతపురం జిల్లా తాడిపత్రిలో వైకాపా నేత, మార్కెట్ యార్డ్ మాజీ వైస్ చైర్మన్ ఆర్సీ ఓబుల్ రెడ్డిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి తెగబడ్డారు. దీంతో ఆయన తలకు బలమైన గాయం తగలడంతో అపస్మారకస్థితిలోకి జారుకున్నారు. 
 
పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు... తాడిపత్రిలోని ఐశ్వర్య విల్లాస్‌ బైపాస్ సమీపంలో ఓబుల్ రెడ్డిపై కొందరు దుండగులు దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఆయనను సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి హుటాహుటిన ఆస్పత్రికి చేరుకుని ఓబుల్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. 
 
అయితే, ఓబుల్ రెడ్డి తలకు బలమైన గాయం తగలడంతో అపస్మారకస్థితిలోకి వెళ్లాడని, ప్రస్తుతం ఆయన పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు చెప్పడంతో ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు... కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ దాడి వెనుక రాజకీయ లేదా వ్యక్తిగత కక్షలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ దాడి ఘటనతో తాడపత్రిలో మరోమారు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.