శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 27 జూన్ 2024 (16:44 IST)

పిన్నెల్లి అరెస్టు.. ఆరంభం మాత్రమే... ఏ ఒక్కడినీ వదిలిపెట్టం : టీడీపీ నేత పట్టాభి!!

Pattabhi
వైకాపా నేత, మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి అరెస్టు కేవలం ఆరంభం మాత్రమేని, గత ఐదేళ్లకాలంలో అధికారాని అడ్డుపెట్టుకుని వేధించిన ప్రతి ఒక్క వైకాపా నేతను వదిలిపెట్టే ప్రసక్తే లేదని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి హెచ్చరించారు. ఈవీఎం ధ్వంసం, సీఐపై దాడి, మహిళను దుర్భాషలాడటంతో పాటు మొత్తం నాలుగు కేసుల్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి పరారీలో ఉన్నారు. ఆయన కోసం పోలీసులు గాలిస్తున్నారు. 
 
ఈ పరిణామాలపై పట్టాభి మాట్లాడుతూ, మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పిరికి సన్నాసి అని... పోలీసులు అరెస్ట్ చేయడానికి వెళ్లినప్పుడు బాత్రూంలో దాక్కున్నాడని తెలిసిందన్నారు. ఇన్నాళ్లు అధికారాన్ని అడ్డం పెట్టుకొని... విర్రవీగాడని, కానీ ఇప్పుడు బాత్రూంలో దాక్కున్నాడని ఎద్దేవా చేశారు. పిన్నెల్లి వెంకట్రామి రెడ్డి బాత్రూం నుంచి దూకి పారిపోయాడన్నారు. అతనిని కూడా వదిలేది లేదన్నారు. ఎన్నిరోజులు పారిపోతారు... వెంకట్రామి రెడ్డిని ఈడ్చుకొచ్చి కటకటాల వెనక్కి పంపించే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు.
 
మాచర్లలో పిన్నెల్లి సోదరుల పాపాలకు లెక్కే లేదన్నారు. రాజారెడ్డి రాజ్యాంగం శాశ్వతం కాదని ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో తీర్పు చెప్పారన్నారు. ఎన్డీయే ప్రభుత్వం వారిలా రౌడీయిజం చేయదన్నారు. కానీ పిన్నెల్లి మాత్రం ఈవీఎంలను ధ్వంసం చేశారని ఆరోపించారు. పిన్నెల్లి సోదరులు నరరూప రాక్షసుల్లా ప్రవర్తించారన్నారు. పిన్నెల్లి అక్రమాలపై ఫిర్యాదు చేసేందుకు క్యూ కడుతున్నారని... వారిపై భవిష్యత్తులో వందలాది ఎఫ్ఐఆర్లు నమోదైనా ఆశ్చర్యం లేదన్నారు. పిన్నెల్లి సోదరుల చేతిలో బలైన వారు ధైర్యంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
 
పిన్నెల్లి అరెస్ట్ ఆరంభమేనని... ఇలాంటి రౌడీ మూకలను జైళ్లకు పంపిస్తామన్నారు. పిన్నెల్లి పాపాలు ఎప్పుడు పండుతాయా? అని ఆయన చేతిలో బలైన వేలాది కుటుంబాలు ఎదురు చూస్తున్నాయన్నారు. ఆయన కటకటాల వెనక్కి వెళ్లాలని చాలామంది వేచి చూస్తున్నారన్నారు. మాచర్ల నియోజకవర్గంతో పాటు రాష్ట్రంలో ఆయన చేతిలో బలైనవారు పిన్నెల్లి అరెస్టు కోసం ఎదురు చూస్తున్నారన్నారు. ఈరోజు ఎటకేలకు బెయిల్ రద్దు కావడంతో అరెస్టు అయ్యారని తెలిపారు.