తరగతిలో అల్లరి చేసిన చిన్నారి.. తలపై కొట్టి టీచర్... బలమైన గాయం (video)
teacher brutally beat student
చిత్తూరు జిల్లాలో ఓ ఉపాధ్యాయుడు చేసిన పనికి ఓ విద్యార్థి తల పుర్రె ఎముక చిట్లింది. చిత్తూరు జిల్లా పుంగనూరులో చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా సోమవారం వెలుగులోకి వచ్చింది.
ఈ వివరాలను పరిశీలిస్తే, పట్టణానికి చెందిన హరి, విజేతల కుమార్తె సాత్విక నాగశ్రీ (11) స్థానికంగా ఓ ప్రైవేట్ పాఠశాలలో ఆరో తరగతి చదువుతోంది. ఈ నెల 10న తరగతి గదిలో ఆ విద్యార్థి అల్లరి చేస్తోందని ఆమె తలపై హిందీ ఉపాధ్యాయుడు స్కూల్ బ్యాగ్ తీసుకుని కొట్టాడు.
అదే స్కూల్లో బాలిక తల్లి విజేత పనిచేస్తున్నా.. మాములుగానే కొట్టి ఉంటారనుకుని పెద్దగా పట్టించుకోలేదు. తలనొప్పిగా ఉందని మూడు రోజుల నుంచి నాగశ్రీ పాఠశాలకు వెళ్లలేదు.
దాంతో ఆ బాలికను పుంగనూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తల్లిదండ్రులు తీసుకెళ్లగా, బెంగళూరు వెళ్లాలని అక్కడి వైద్యులు సూచించారు. బాలికను బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చూపించగా.. పుర్రె ఎముక చిట్లినట్లు పరీక్షల్లో తేలింది. అది విద్యార్థికి తీవ్ర సమస్యగా మారిందన్నారు. సోమవారం రాత్రి స్కూల్ యాజమాన్యంపై విద్యార్థి తల్లి, బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.