పవన్ టార్గెట్ వెనుక భారీ కుట్ర - జగన్ ఓ రాజకీయ ఉన్మాది : నాదెండ్ల మనోహర్
సోషల్ మీడియాలో జనసేన పార్టీ అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను టార్గెట్‌గా చేసుకుని విమర్శలు చేయడాన్ని ఆ పార్టీ సీనియర్ నేత, ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్ తీవ్రంగా స్పందించారు. జగన్ ఒక రాజకీయ ఉన్మాది.. అధికారం కోసం ఎంతకైనా తెగిస్తారు అంటూ మండిపడ్డారు. అందులోభాగంగానే కూటమి ప్రభుత్వంపై విష ప్రచారంతోపాటు, గత వారం రోజులుగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, జనసేన పార్టీపై బురద చల్లేందుకు కుట్రలు పన్నుతున్నారని ఆయన ఆరోపించారు.
గుంటూరు జిల్లా తెనాలిలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, సోషల్ మీడియాను ఉపయోగించి ఇప్పుడు పవన్‌ను, జనసేనను టార్గెట్ చేస్తున్నారని, దీని వెనుక కుట్ర ఉందని ఆరోపించారు. సోషల్ మీడియాను కూడా వారి దుర్మార్గపు రాజకీయాల కోసం వాడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మళ్లీ ఏ విధంగానైనా అధికారం దక్కించుకునేందుకు కావాలనే కొందరితో పోస్టులు పెట్టించి అలజడులు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. మంచిలీపట్నంలో ఏం జరిగిందనే దానిపై జనసేన అధినేత విచారణకు ఆదేశించారని, తమ పార్టీ నాయకులు, కార్యకర్తల తీరులో పొరపాటు ఉంటే చర్యలు తీసుకుంటామని చెప్పారు.
జగన్.. అధికారంలో ఉండగా అంతకు మించిన దారుణాలు జరిగితే ఏమయ్యారని మనోహర్ ప్రశ్నించారు. జగన్ నియంతృత్వ పాలనను తట్టుకోలేని ప్రజలు ఇంటికి పంపినా.. జగన్‌లో మార్పు రాకపోవటం ఆయన ఆరాచక రాజకీయ నైజానికి నిదర్శనమన్నారు. రెచ్చగొట్టేందుకు వైసీపీ చేస్తున్న కుట్రలో చిక్కుకోవద్దని తమ పార్టీ నాయకులు, కార్యకర్తలకు సూచించారు. ఎవరైనా సమాజంలో అలజడులు సృష్టిద్దామనుకున్నా, తమపై అసత్య ప్రచారాలు చేద్దామని చూసినా చట్టపరంగానే ఎదుర్కొంటామన్నారు. సోషల్ మీడియా దుర్వినియోగాన్ని నియంత్రించేలా చట్టాలను కఠినతరం చేయనున్నామని తెలిపారు.