గురువారం, 25 సెప్టెంబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 16 సెప్టెంబరు 2025 (17:57 IST)

వివేకా హత్య కేసు : సునీతకు కీలక సూచన చేసిన సుప్రీంకోర్టు

avinash - viveka
వైకాపా మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆయన కుమార్తె డాక్టర్ సునీతా రెడ్డికి సుప్రీంకోర్టు కీలక సూచన చేసింది. ఈ కేసులోని నిందితులకు మంజూరు చేసిన బెయిల్స్‌ను రద్దు చేయాలని కోరుతూ ఆమె దాఖలు చేసిన పిటషన్‌పై విచారణ జరిపింది. ఈ కేసులో తదుపరి విచారణ కొనసాగించాలా వద్దా అనే అంశంపై నిర్ణయం తీసుకునే అధికారాన్ని సర్వోన్నత న్యాయస్థానం ట్రయల్ కోర్టు అప్పగించింది. నిందితులకు మంజూరు చేసిన బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ వివేకా కుమార్తె సునీతారెడ్డి దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ కీలక ఆదేశాలు జారీ చేసింది.
 
విచారణ కొనసాగింపు ఆవశ్యకతను తెలియజేస్తూ రెండు వారాల్లోగా ట్రయల్ కోర్టులో కొత్తగా ఒక పిటిషన్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు డాక్టర్ సునీతారెడ్డికి సూచించింది. ఆ పిటిషన్ను స్వీకరించిన నాటి నుంచి 8 వారాల్లోగా దానిపై ఒక నిర్ణయం తీసుకోవాలని ట్రయల్ కోర్టును ఆదేశించింది. ట్రయల్ కోర్టు ఈ విషయంపై స్పష్టత ఇచ్చేంత వరకు నిందితుల బెయిల్ రద్దు పిటిషన్లపై తాము విచారణ చేపట్టబోమని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.
 
విచారణ సందర్భంగా సునీతారెడ్డి తరపు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ, ఈ కేసులో మరిన్ని ఆధారాలు వెలుగులోకి రావాల్సి ఉందని, అందువల్ల తదుపరి విచారణ చాలా అవసరమని కోర్టుకు తెలిపారు. బెయిల్‌పై బయట ఉన్న నిందితులు సాక్షులను భయభ్రాంతులకు గురిచేస్తూ, సాక్ష్యాధారాలను తారుమారు చేసే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన సీబీఐ, సుప్రీంకోర్టు ఆదేశిస్తే విచారణను కొనసాగించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని నివేదించింది.
 
తాజా ఆదేశాలతో, వివేకా హత్య కేసు విచారణ భవిష్యత్తు ఇప్పుడు పూర్తిగా ట్రయల్ కోర్టు తీసుకోబోయే నిర్ణయంపైనే ఆధారపడి ఉంది. ట్రయల్ కోర్టు తీర్పు వెలువడిన తర్వాతే సుప్రీంకోర్టులో బెయిల్ రద్దు పిటిషన్లపై విచారణ తిరిగి ప్రారంభం కానుంది.