శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 6 నవంబరు 2024 (12:35 IST)

వైకాపా సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్టు

varra ravinder reddy
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్, హోం మంత్రి అనితలతో పాటు అనేక మందిపై సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్టులు పెట్టిన వైకాపా సోషల్ మీడియా కార్యకర్త, కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి ముఖ్య అనుచరుడు వర్రా రవీందర్ రెడ్డిని పోలీసులు మంగళవారం సాయంత్రం అరెస్టు చేశారు. రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఆయన సోషల్ మీడియా వేదికగా మరింతగా రెచ్చిపోయిన విషయం తెల్సిందే.
 
ముఖ్యంగా, ప్రతిపక్ష నేతలను లక్ష్యంగా చేసుకుని అసభ్యకర పోస్టులు పెట్టారు. రాష్ట్రంలో అధికారి మార్పిడి చోటుచేసుకున్న తర్వాత కూడా తన వైఖరిని మార్చుకోకుండా అసభ్యకర పోస్టులు పెడుతూనే ఉన్నాడు. దీంతో పోలీసులు కడప జిల్లా పులివెందులలో అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఆయనను విజయవాడ నగరానికి తీసుకొచ్చి రహస్య ప్రదేశానికి తీసుకెళ్లి విచారిస్తున్నారు. 
 
కాగా, గత వైకాపా ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డిని విమర్శించిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టలేదు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేశ్, అనిత, వైఎస్ షర్మిల, వైఎస్ సునీత, వైఎస్ విజయమ్మ ఇలా ప్రతి ఒక్కరినీ విమర్శించారు. పైగా, జగనన్న ఆదేశిస్తే దేనికైనా సిద్ధమే అన్న విధంగా పోస్టులు పెట్టారు. 'అవసరమైతే సునీతను కూడా లేపేయండి' అన్న అంటూ రాయలేని భాషలో సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారు. 
 
చివరకు జగన్ తల్లి విజయమ్మపైనా అసభ్యకర పోస్టులకు వెనకాడలేదు. రవీందర్ రెడ్డి పోస్టులపై మనస్థాపానికి గురైన వివేకా కుమార్తె సునీత, సైబరాబాద్​లో సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేశారు. షర్మిల కూడా హైదరాబాద్​లో ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. కానీ, ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇపుడు పాపం పండింది. ఏపీ పోలీసులు అరెస్టు చేసి విచారణ జరుపుతున్నారు.