శుక్రవారం, 10 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 6 డిశెంబరు 2024 (09:40 IST)

దిగివచ్చిన పాకిస్థాన్.. అప్పటివరకు హైబ్రిడ్ విధానంలోనే మ్యాచ్‌ల నిర్వహణ

icccricekt
పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) దిగివచ్చింది. వచ్చే యేడాది పాక్ వేదికగా జరగాల్సిన చాంపియన్స్ ట్రోఫీ టోర్నీని హైబ్రిడ్ విధానంలో నిర్వహించేందుకు సమ్మతం తెలిపినట్టు అంతర్జాతీయ క్రికెట్ వర్గాలు సూచన ప్రాయంగా వెల్లడించింది. అయితే, 2027 వరకు భారత్, పాకిస్థాన్ దేశాల్లో అన్ని టోర్నీలు హైబ్రిడ్ విధానంలో నిర్వహించాలని పాకిస్థాన్ పట్టుబట్టింది. 
 
ఇక ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా భారత క్రికెట్ జట్టు ఆడే తన మ్యాచ్‌‍లను దుబాయిలో ఆడటానికి కూడా మార్గం సుగమమైనట్లు తెలుస్తోంది. పాకిస్థాన్‌తో సహా వివిధ దేశాల క్రికెట్ బోర్డు డైరెక్టర్లతో ఐసీసీ కొత్త అధ్యక్షుడు జైషా గురువారం దుబాయిలోని ఐసీసీ ప్రధాన కార్యాలయంలో జరిపిన అనధికారిక సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
 
'2025 ఛాంపియన్స్ ట్రోఫీని యూఏఈ, పాకిస్థాన్‌లో భారత్‌తో కలిసి ఆడాలని హైబ్రిడ్ మోడల్ అన్ని బోర్డులు సూత్రప్రాయంగా అంగీకరించాయి. ఇది అందరి విజయం. మంచి నిర్ణయం' అని ఐసీసీ వర్గాలు పీటీఐకి తెలిపాయి.
 
ఇక వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చిలో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుంది. దీనికోసం మొదట పీసీబీ తాము హైబ్రిడ్ మోడల్‌ను అంగీకరించబోమని, కావాలంటే బాయ్‌కట్ చేస్తామని బెదిరింపు ధోరణిని అవలంభించింది. అయితే, గతవారం జరిగిన సమావేశంలో మెట్టుదిగిన పాక్ బోర్డు హైబ్రిడ్ మోడల్‌కు అంగీకరించింది. 
 
కానీ, 2031 వరకు భారత్, పాకిస్థాన్ దేశాల్లో జరిగే ఐసీసీ టోర్నీలన్నింటినీ ఇదే విధానంలో జరపాలని డిమాండ్ చేసింది. అలా అయితే తాము హైబ్రిడ్ మోడల్‌కు అంగీకరిస్తామని పేర్కొంది. ఇక తాజా సమావేశంలో ఐసీసీ 2027 వరకు భారత్, పాక్‌లో జరిగే అన్ని టోర్నీలను హైబ్రిడ్ విధానంలో నిర్వహించేందుకు ఒప్పుకుంది. దీనికి పీసీబీ కూడా ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.
 
కాగా, ఈ సమయంలో భారత్ వచ్చే యేడాది అక్టోబరులో మహిళల వన్డే ప్రపంచకప్, 2026లో పురుషుల టీ20 ప్రపంచకప్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ నేపథ్యంలో ఈ రెండు ఐసీసీ టోర్నీలను హైబ్రిడ్ మోడల్లో భాగంగా శ్రీలంకతో కలిసి భారత్ నిర్వహించనుంది.