శుక్రవారం, 10 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 28 ఏప్రియల్ 2024 (19:36 IST)

ఐపీఎల్ 2024 : బెంగుళూరు ఖాతాలో మూడో విజయం

ipl2024
ఐపీఎల్ 2024 సీజన్ పోటీల్లో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు జట్టు మూడో విజయాన్ని అందుకుంది. ఆదివారం అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో గుజరాత్ జట్టుపై 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. ప్రత్యర్థి నిర్ధేశించిన 201 పరుగుల విజయలక్ష్యాన్ని కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి, మరో నాలుగు ఓవర్లు మిగిలివుండగానే చేరుకుంది. ఆ జట్టులో జాక్స్ ఫోర్లు, సిక్సర్లతో విధ్వంసం సృష్టించి సెంచరీ చేశాడు. అలాగే మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ సైతం చెలరేగి ఆడాడు. ఫలితంగా ఆ జట్టు విజయభేరీ మోగించింది. ఈ మ్యాచ్‍లో జాక్ 41 బంతుల్లో పది సిక్సర్లు, ఐదు ఫోర్ల సాయంతో 100 పరుగులు చేసి నాటౌట్‌గా నిలువగా, కోహ్లీ 44 బంతుల్లో ఆరు ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 70 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు. దీంతో 201 పరుగుల విజయలక్ష్యం చిన్నబోయింది. డుప్లెసిస్ 12 బంతుల్లో ఓ ఫోర్, మూడు సిక్సర్ల సాయంతో 24 పరుగులు చేశారు. 
 
గుజరాత్ బౌలర్లలో రవి శ్రీనివాసన్ ఒక వికెట్ రాబట్టుకున్నాడు. 31 బంతుల్లో అర్థ శతకం పూర్తి చేసిన విల్ జాక్స్.. మరో 10 బంతుల్లోనే సెంచరీ బాదేశాడు. ఇది చాలు అతడి విధ్వంసం ఎలా సాగిందో చెప్పడానికి. వీల్ జాక్స్ ఆరంభంలో నెమ్మదిగానే ఆడాడు. మోహిత్ శర్మ వేసిన 11 ఓవర్ నుంచి దూకుడు మొదలెట్టాడు. ఆ ఓవరులో ఓ సిక్స్, ఫోర్ రాబట్టిన అతడు.. సాయి కిశోర్, నూర్ అహ్మద్ బౌలింగ్ ఒక్కో సిక్స్ కొట్టాడు. మోహిత్ శర్మ వేసిన 15 ఓవర్లో జాక్స్ మొదటి రెండు బంతులకు ఫోర్, సిక్స్ బాది హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. తర్వాత ఇదే ఓవరులో రెండు సిక్స్‌లు, ఓ ఫోర్ బాదేశాడు. ఇక రషీద్ ఖాన్ వేసిన 16 ఓవరులో విల్ జాక్స్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. వరుసగా 6, 6, 4, 6, 6 దంచేసి సెంచరీ పూర్తి చేసుకోవడంతోపాటు బెంగళూరుకు భారీ విజయాన్ని అందించాడు. 
 
అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. ఓపెనర్లు వృద్ధిమాన్ సాహా (5), శుభ్ మన్ గిల్ (16) నిరాశపరిచినప్పటికీ.. ఫస్ట్ డౌన్లో వచ్చిన సాయి సుదర్శన్ 49 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్స్‌ల సాయంతో 84 పరుగులు చేశాడు. వరుస ఫోర్లు, సిక్సర్లతో బెంగళూరు బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. అగ్నికి వాయువు తోడైనట్లు రెండో డౌనులో వచ్చిన షారూఖ్ ఖాన్ 30 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 58 పరుగులు చేశాడు. ఇద్దరూ కలిసి బెంగళూరును ఎడాపెడా బాదేశారు. భయంకరంగా మారిన ఈ జోడీని సిరాజ్ విడగొట్టాడు. 14.1వ బంతికి షారూఖ్ బౌల్డయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన డేవిడ్ మిల్లర్ 19 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్ సాయంతో (26) కూడా ఏమాత్రం తగ్గలేదు. దీంతో గుజరాత్ భారీ స్కోరే చేసింది. బెంగళూరు బౌలర్లలో స్వప్నిల్ సింగ్, సిరాజ్, మాక్స్‌వెల్ ‌తలో వికెట్ తీశారు.