శుక్రవారం, 10 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By వరుణ్

శ్రీలంక క్రికెటర్లకు జయసూర్య క్లాస్.. హెయిర్‌ స్టయిల్ సాధారణంగా ఉండాలంటూ ఆదేశం..

sanath jayasurya
తమ దేశ క్రికెటర్లకు శ్రీలంక క్రికెట్ లెజెండ్ సనత్ జయసూర్య క్లాస్ పీకారు. క్రికెట్ క్రీడ జెంటిల్మెన్ క్రీడ అని అందువల్ల ఆటగాళ్ల వేషధారణ కూడా ఆ స్థాయిలోనే ఉండాలన్నారు. సో జాతీయ జట్టుకు సారథ్యం వహించే ప్రతి ఒక్క క్రికెటర్ హెయిర్ స్టయిల్ సాధారణంగా ఉండాలంటూ ఆదేశించారు. పైగా, జట్టులోని ఆటగాళ్ల నుంచి తాను క్రమశిక్షణ ఆశిస్తున్నానని తెలిపారు. 
 
సాధారణంగా నేటితరం క్రికెటర్లు అనేక మంది ఫ్యాషన్ ఐకాన్లుగా నిలుస్తారు. చిత్రవిచిత్రమైన హెయిర్ స్టయిల్స్, టాటూలు, చెవులకు రింగులు, ముక్కుపుడకలు ధరిస్తూ పలువురు క్రికెటర్లు అందరి దృష్టిని ఆకర్షిస్తుంటారు. అయితే, శ్రీలంక క్రికెట్ జట్టు తాత్కాలిక కోచ్, బ్యాటింగ్ దిగ్గజం సనత్ జయసూర్య ఆలోచనలు మరోలా ఉన్నాయి.
 
క్రికెట్ అనేది జెంటిల్మన్ క్రీడ అని, యువ ఆటగాళ్లకు క్రమశిక్షణ అవసరమని జయసూర్య అభిప్రాయపడ్డాడు. అంతేకాదు, ఆటగాళ్లందరూ జుట్టు కత్తిరించుకుని, సాధారణ హెయిర్ స్టయిల్‌ను అనుసరించాలని సూచించాడు. క్రికెటర్లు నీట్‌‌గా ఉండడం అవసరమని, అభిమానులు తమను గమనిస్తుంటారన్న విషయాన్ని క్రికెటర్లు గుర్తించాలని జయసూర్య పేర్కొన్నాడు. తాను ప్రస్తుతం శ్రీలంక జట్టుకు తాత్కాలిక కోచ్‌గా మాత్రమే ఉన్నానని, ఆటగాళ్లు క్రమశిక్షణతో ఉండాలని కోరుకుంటానని తెలిపాడు.
 
కాగా, భారత క్రికెట్ జట్టు ఈ నెలాఖరులో శ్రీలంకలో పర్యటించనుంది. ఈ టూర్‌లో టీ20 సిరీస్, వన్డే సిరీస్‌లను ఇరు జట్లూ ఆడనున్నాయి. ఈ నేపథ్యంలో జయసూర్య వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. జయసూర్య వ్యాఖ్యలను శ్రీలంక ఆటగాళ్లు ఎంతవరకు పాటిస్తారన్నది ఆసక్తి కలిగిస్తోంది. శ్రీలంక, టీమిండియా మధ్య టీ20 సిరీస్ జులై 27 నుంచి, వన్డే సిరీస్ ఆగస్టు 2 నుంచి జరగనున్నాయి.