బుధవారం, 12 మార్చి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 11 మార్చి 2025 (22:51 IST)

అత్తగారితో నేనుండనన్న కోడలు, తల్లీకొడుకుల ఆత్మహత్యతో కథ ముగిసింది

mentally Stressed
ఉమ్మడి కుటుంబాలు క్రమంగా కనుమరుగవుతున్నాయి. ఈరోజుల్లో కొంతమంది అమ్మాయిల ధోరణి కాస్తంత భిన్నంగా వుంటోంది. పెళ్లి చేసుకునేటపుడు మాత్రం అత్తమామలు అవసరం, కానీ పెళ్ళయ్యాక ఇక వారితో వుండటం సాధ్యం కాదని ముఖం మీదే చెప్పేస్తున్నారు. దీనికి కారణాలు ఏమైనా కావచ్చు కానీ సర్దుకుపోయే మనస్తత్వం వుండటంలేదు. ఫలితంగా అటు కోడలు కానీ లేదా అత్త కానీ బలి అవుతున్నారు. కర్నాటకలోని హసన్ జిల్లాలో ఇటువంటి ఘటనే జరిగింది. అత్తాకోడలు కలహాల కారణంగా తల్లీకొడుకులు ఆత్మహత్య చేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. హసన్ జిల్లాలోని చిన్నరాయపట్నం కబాలి గ్రామంలో భరత్ అనే 35 ఏళ్ల యువకుడు 8 నెలల క్రితం అరసికెర తాలూకాకి చెందిన గీతను వివాహం చేసుకున్నాడు.
 
ఐతే వివాహం జరిగిన కొన్ని రోజులు అంతా బాగానే వుంది. కానీ నెల రోజులు గడిచాక అత్తాకోడళ్లకు అసలు ఏమాత్రం పడటంలేదు. దీనితో వీరిద్దరి మధ్య తరచూ గొడవలు జరగడం ప్రారంభమైంది. ఇద్దరికీ సర్దిచెప్పలేక భరత్ సతమతమయ్యేవాడు. అత్త వేధిస్తోందంటూ గత నెల గీత తన పుట్టింటికి వెళ్లిపోయింది. ఐతే గ్రామ పెద్దల జోక్యంతో తిరిగి వచ్చింది. రావడమైతే వచ్చింది కానీ అత్తాకోడళ్ల మధ్య అగ్ని మాత్రం అలానే రగిలిపోయింది. దీనితో మరోసారి కోడలు భర్తకి వార్నింగ్ ఇచ్చింది.
 
తను ఇక్కడ వుండననీ, నీకు తల్లి కావాలో నేను కావాలో తేల్చుకోమంటూ అత్తింటిని వదిలేసి వెళ్లిపోయింది. దీనితో భరత్ తీవ్ర ఆవేదన చెందాడు. తల్లిని విడిచి వెళ్లలేక మధనపడ్డాడు. చివరికి తల్లీకొడుకులు తీవ్రమైన నిర్ణయం తీసుకున్నారు. ఇలా అవమానభారంతో బ్రతికేకంటే మరణించడమే మార్గమని ఇద్దరూ కలిసి దేవాలయానికి సమీపంలో వున్న నీటిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వారు వుంటున్న ఇంట్లో సూసైడ్ నోట్ లభించింది. అందులో తన అంత్యక్రియలలో తన భార్యను పాల్గొనకుండా చూడాలంటూ భర్త భరత్ కోరాడు.