శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 22 అక్టోబరు 2024 (20:22 IST)

నా ప్రాణ స్నేహితుడిని నేనే హత్య చేసా: బోరున విలపిస్తూ పోలీసులకు సమాచారం

crime
వాళ్లిద్దరూ చిన్ననాటి నుంచి ప్రాణస్నేహితులు. వ్యాపారం అయినా కుటుంబ వేడుకలైనా కలిసిమెలిసి చేసుకునేవారు. అలాంటిది ఇద్దరూ కలిసి మద్యం సేవించేందుకు కూర్చున్నారు. అలా మద్యం తాగుతూ ఒకరినొకరు తిట్టుకోవడం మొదలుపెట్టారు. ఇద్దరి కోపాలు తారాస్థాయికి వెళ్లాయి. దీనితో తన స్నేహితుడిని తువ్వాలుతో మెడకు బిగించి హత్య చేసేసాడు. ఆ తర్వాత బోరున విలపిస్తూ నా స్నేహితుడిని నేనే చంపేసానంటూ పోలీసులకి సమాచారం ఇచ్చాడు.
 
పూర్తి వివరాలను చూస్తే.. విజయవాడలోని అయోధ్యనగర్ లోని లోటస్ సెక్టార్ 1 పృధ్వీ అపార్టుమెంటు యజమాని అయిన వెంకట నరసింహరాజు(54 ఏళ్లు) హైదరాబాదులో ఆదిత్య ఫార్మసీ నడుపుతున్నాడు. ఇతడికి యనమలకుదురుకి చెందిన 54 ఏళ్ల మహ్మద్ రఫి ప్రాణస్నేహితుడు. ఎప్పుడు హైదరాబాద్ నుంచి వచ్చినా యనమలకుదురులో వుండే రఫీకి ఫోన్ చేసి తన ఫ్లాటుకి రప్పించుకుని మంచిచెడ్డలు మాట్లాడుకోవడం అతడికి అలవాటు. అలాగే ఇద్దరూ కలిసి మద్యం కూడా సేవిస్తుంటారు. ఎప్పటిలాగే స్నేహితుడిని పిలిచి ఇద్దరూ కలిసి మద్యం సేవించారు.
 
ఈ క్రమంలో ఇద్దరిమధ్య ఏదో విషయమై మాటామాటా పెరిగింది. దీనితో కోపోద్రిక్తుడైన మహ్మద్ రఫి పక్కనే వున్న కత్తెర తీసుకుని నరసింహరాజును పొడవబోయాడు. రఫి చర్యకు ఉగ్రుడైన నరసింహరాజు తన తువాలు తీసుకుని రఫి మెడకి గట్టిగా ఊపిరాడకుండా బిగించేసాడు. దానితో రఫి అక్కడికక్కడే మృతి చెందాడు. స్నేహితుడు విగతజీవిగా పడిపోవడాన్ని చూసి బోరున విలపించాడు. వెంటనే పోలీసులకు ఫోన్ చేసి... తన స్నేహితుడిని తాగిన మైకంలో హత్య చేసానంటూ బోరున విలపిస్తూ చెప్పాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.