కుమార్తెకు రెండో పెళ్లి చేయాలని మనవరాలిని చంపేసిన అమ్మమ్మ...
ఏపీలో దారుణం జరిగింది. కుమార్తెకు పునర్వివాహం వివాహం చేయాలని భావించిన కన్నతల్లి తన మనవరాలిని హత్య చేసింది. ఈ హత్యలో కన్నతల్లి కూడా పాలుపంచుకుంది. ఈ దారుణ ఘటన తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురం మండలం, నరసింగపురంలో చోటుచేసుకుంది.
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఈ గ్రామానికి చెందిన శైలజ, సతీష్ అనే యువతీయవకులు ప్రేమించుకున్నారు. రెండేళ్ళ క్రితం ఇంట్లో నుంచి వెళ్ళిపోయి కులాంతక వివాహం చేసుకున్నారు. వీరి కాపురానికి గుర్తుగా యశ్విత అనే కుమార్తె పుట్టింది.
అయితే, ఈ కులాంతర వివాహం శైలజ తల్లికి ఏమాత్రం ఇష్టం లేదు. ఈ క్రమంలో శైలజ, సతీశ్లకు మనస్పర్థలు తలెత్తాయి. దీంతో కుమార్తెను తీసుకుని పుట్టింటికి వచ్చేసింది. మనవరాలితో వచ్చిన కుమార్తెను చేరదీసిన కన్నతల్లి.. నెమ్మదిగా కుమార్తె మనసు మార్చింది. తమ కులంలోనే మంచి యువకుడుని చూసి మళ్లీ పెళ్లి చేస్తానని నమ్మబలికింది.
అయితే, రెండో పెళ్ళికి మనవరాలు అడ్డుగా మారింది. దీంతో బిడ్డను అడ్డుతొలగించుకోవాలని ఇద్దరూ కలిసి పథకం వేశారు. ఈ నెల 6వ తేదీన పసికందు యశ్విత గొంతు నులిమి హత్య చేశారు. ఆపై పక్కింట్లోని బావిలోపడేశారు. గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్రపూజలు చేసి తమ బిడ్డను చంపేశారంటూ ఇరుగుపొరుగువారిని నమ్మబలికారు.
దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు... మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టారు. ఈ విచారణలో తల్లీ కుమార్తెల మీద అనుమానం రావడంతో వారిని అదుపులోకి తీసుకుని విచారించారు. శైలజ రెండో పెళ్లికి అడ్డుగా మారుతుందనే ఉద్దేశంతో తామే బిడ్డను చంపేసినట్టు అంగీకరించారు. దీంతో వారిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.