పోలీస్ స్టేషన్కు కూతవేటు దూరంలో మహిళ హత్య
తెలంగాణా రాష్ట్రంలో పట్టపగలు, పోలీస్ స్టేషన్కు కూతవేటు దూరంలో ఓ మహిళ దారుణ హత్య జరిగింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం పోలీస్ స్టేషన్ వద్ద ఓ కేసులో నిందితురాలిగా ఉన్న లక్ష్మి అనే మహిళను శ్రీరామ్ అనే వ్యక్తి గొడ్డలితో నరికి హత్య చేశాడు. ఆస్తి తగాదాలపై గతంలో సారయ్య అనే వ్యక్తిని హత్య చేసిన కేసులో లక్ష్మి నిబంధనల బెయిలుపై బయట ఉన్నారు.
ఈ క్రమంలో ఆమె తన వ్యక్తిగత పనిమీద వెళుతుండగా మాటువేసిన శ్రీరామ్... గొడ్డలితో విచక్షణా రహితంగా దాడి చేయడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. నిందితుడు శ్రీరామ్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని సమీప ఆస్పత్రికి తరలించారు. పరారీలో ఉన్న నిందితుడు కోసం గాలిస్తున్నారు.