శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 18 అక్టోబరు 2024 (09:05 IST)

కెనడాలో ఏమాత్రం చలనం లేదు.. ఆరోపణలు తిప్పికొట్టిన భారత్

india vs canada
భారత్‌ను లక్ష్యంగా చేసుకుని కెనడా చేస్తున్న ఆరోపణలను భారత్ తిప్పికొట్టింది. పైగా, కెనడాను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించింది. లారెన్స్ బిష్ణోయ్ ముఠాతో సంబంధం ఉన్న వ్యక్తులను సరెండర్ చేయాలని పదేపదే కోరుతున్నప్పటికీ కెనడా నుంచి ఎలాంటి స్పందన లేదని భారత్ ఆరోపించింది. పైగా బిష్ణోయ్ ముఠాపై చర్యలు తీసుకోవడంలో విఫలమైందని స్పష్టం చేసింది. మొత్తం 26 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని భారత్ పేర్కొంది. 
 
కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ప్రభుత్వం తీరు, నిరాధార ఆరోపణల వల్లే తాజా సంక్షోభం ఏర్పడిందని తెలిపింది. భారత్ - కెనడా దేశాల మధ్య దౌత్యపరంగా సంక్షోభం ఏర్పడినప్పటికీ ఆర్థిక సంబంధాలు మాత్రం బలంగానే ఉన్నాయని గుర్తు చేసింది. తాజా పరిణామాలపై భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ స్పందిస్తూ... లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యులను అరెస్టు చేయాలని కెనడాకు అనేక సార్లు విజ్ఞప్తి చేసినా భారత్ ఆందోళనలను వారు పట్టించుకోవడం లేదని, ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆయన అన్నారు. దీని వెనుక రాజకీయ ఉద్దేశం ఉందని ఆయన అన్నారు. నేరస్థుల అప్పగింత కేసులకు సంబంధించి ఇప్పటి వరకూ 26 విజ్ఞప్తులు పెండింగులో ఉన్నాయన్నారు.
 
ఖలిస్థానీ ఉగ్రవాది నిజ్జర్ హత్యలో భారత్ ఏజెంట్ల హస్తం ఉందని గత యేడాది నుంచి కెనడా చేస్తున్న ఆరోపణలకు ఎటువంటి ఆధారాలు ఇవ్వలేదన్నారు. విచారణ కమిషన్ ముందు ఈ విషయాన్ని ట్రూడో అంగీకరించారని ఆయన గుర్తు చేశారు. ఆ తర్వాత కూడా మళ్లీ భారత్‌పై ఆరోపణలు చేయడం శోచనీయమన్నారు. భారత్ దౌత్యవేత్తలపై కెనడా చేసిన ఆరోపణలను మరోసారి ఆయన ఖండించారు. భారత వ్యతిరేక చర్యలను కెనడా ప్రోత్సహిస్తోందని ఆయన అన్నారు.