గురువారం, 11 సెప్టెంబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 11 సెప్టెంబరు 2025 (10:54 IST)

నేపాల్ ప్రధాని రేసులో బెంగుళూరు విద్యార్థి

balendra shah
అంతర్గత ఘర్షణలతో అట్టుడుకిపోతున్న నేపాల్‌లో ఆ దేశ కొత్త ప్రధాని రేసులో బెంగుళూరుకు చెందిన విద్యార్థి పేరు తెరపైకి వచ్చింది. ఆయన పేరు బలేంద్ర షా. నేపాల్ మేయర్గా ఉన్నారు. ప్రస్తుతం నేపాల్‌ అంతర్గత ఘర్షణలతో అట్టుకుడిపోతుంది. జెన్ జెడ్ ఉద్యమం ఇందుకు కారణంగా నిలిచింది. అయితి, ఈ ఉద్యమ నేతలు ఆ దేశ నాయకత్వాన్ని సమూలంగా మార్చాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. ఇందులోభాగంగా, ఆ దేశ ప్రధాని కేపీ శర్మతో రాజీనామా చేయించారు. 
 
దీంతో కొత్త ప్రధాని ఎంపికలో ఒకరిద్దరు నేతలు పోటీ పడుతున్నారు. వీరిలో ఖాట్మండు మేయర్‌ బలేంద్ర షా ఒకరు. నేపాల్‌ యువతకు నాయకత్వం వహించే సత్తా ఉన్న వారిలో బలేంద్రకు మరో బలం ఆయన విద్యార్హతలు. సివిల్‌ అండ్‌ స్ట్రక్చరల్‌ ఇంజినీరింగ్‌ పట్టభద్రుడు. 
 
భారత్‌ దౌత్య కార్యాలయం సహకారంతో నేపాల్‌ నుంచి కర్ణాటకకు వచ్చిన బలేంద్ర బెళగావిలోని విశ్వేశ్వర సాంకేతిక విశ్వవిద్యాలయంలో బీఈలో చేరారు. అనంతరం బెంగళూరులోని నిట్టే మీనాక్షి సంస్థలో చేరి 2016-18 వరకు ఎంటెక్‌ను పూర్తి చేశారు. చదువుతున్న సమయంలోనే సంగీతంపై ఉన్న పట్టుతో ర్యాంపర్‌గా, సామాజిక మాధ్యమాల్లో అత్యంత చురుకుగా కనిపించే బలేంద్ర షా ఎంటెక్‌ తర్వాత నేపాల్‌ ప్రభుత్వం చేపట్టిన భారీ సొరంగ మార్గం నిర్మాణ ప్రాజెక్టులో సివిల్‌ ఇంజినీర్‌గా చేరారు. 
 
ఆ తర్వాత రాజకీయాల వైపు దృష్టి సారించిన బలేంద్ర 2022లో ఖాట్మండు మేయర్‌ ఎన్నికల్లో స్వతంత్య అభ్యర్థిగా గెలిచి ప్రధాన పార్టీలు నివ్వెర పోయేలా చేశారు. సామాజిక మాధ్యమం ద్వారా సంపాదించిన ఫాలోవర్స్‌ మద్దతుతోనే ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన బలేంద్ర చదువుతున్న సమయంలో ఎన్నడూ రాజకీయాల గురించి మాట్లాడేవారు కాదని ఆయనకు చదువు చెప్పిన అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ శ్రేయాస్‌ చెప్పారు.