పాకిస్థాన్‌కు ఐఎంఎఫ్ నిధులపై సమీక్ష.. అడ్డు చెప్పనున్న భారత్!
పాకిస్థాన్‌కు అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) వివిధ రూపాల్లో ఆర్థిక సాయం చేస్తోంది. అయితే, ఈ ప్యాకేజీలపై భారత్ తీవ్ర అభ్యంతరాలను వ్యక్తం చేస్తోంది. ముఖ్యంగా, ఐఎంఎఫ్ ఇచ్చే నిధులను ఉగ్రవాదాన్ని పెంచిపోషించేందుకు వినియోగిస్తుందంటూ భారత్ ఆరోపిస్తూ, తన అభ్యంతరాలను, ఆందోళలను వ్యక్తం చేయనుంది.
శుక్రవారం వాషింగ్టన్‌లో జరుగనున్న ఐఎంఎఫ్ బోర్డు సమావేశంలో ఈ అంశంపై భారత్ తన వాదనను స్పష్టంగా వినిపిస్తుందని విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ గురువారం మీడియాకు తెలిపారు. పాకిస్థాన్‌కు ఇచ్చే రుణాలను ఆ దేశం ఉగ్రవాద కార్యకలాపాలకు, ముఖ్యంగా లష్కరే తోయిబా (ఎల్ఆస్ఈటీ), జైషే మహమ్మద్ (జేఈఎం) వంటి సంస్థలకు పరోక్షంగా నిధులు సమకూర్చడానికి వాడుకుంటోందని మిశ్రీ ఆరోపించారు.
'పాకిస్థాన్ ప్రపంచ ఉగ్రవాదానికి కేంద్రంగా మారిందనడానికి అనేక ఉదాహరణలున్నాయి. ఒసామా బిన్ లాడెన్ ఎక్కడ దొరికాడో, అతడిని అమరవీరుడని ఎవరు కీర్తించారో గుర్తుచేయనవసరం లేదు' అని ఆయన వ్యాఖ్యానించారు. ఐక్యరాజ్యసమితిచే నిషేధించబడిన అనేకమంది ఉగ్రవాదులు పాకిస్థాన్‌లో స్వేచ్ఛగా తిరుగుతున్నారని కూడా ఆయన ప్రస్తావించారు.
గతంలో పాకిస్థాను ఐఎంఎఫ్ ఇచ్చిన 24 బెయిలౌట్ ప్యాకేజీలలో చాలా వరకు విజయవంతం కాలేదని మిశ్రీ గుర్తుచేశారు. పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్, మాజీ విదేశాంగ మంత్రి కూడా తమ దేశానికి ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్నాయని ఇటీవల అంగీకరించిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న పాకిస్థాన్, ఐఎంఎఫ్ సహాయంపైనే ఎక్కువగా ఆధారపడుతోంది.
ఏప్రిల్ 22న కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి, ఆ తర్వాత పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరాలపై భారత్ చేపట్టిన "ఆపరేషన్ సిందూర్" వంటి పరిణామాల నేపథ్యంలో ఈ ఐఎంఎఫ్ సమీక్ష ప్రాధాన్యతను సంతరించుకుంది. మే 7, 8 తేదీల్లో పాకిస్థాన్ ఉత్తర, పశ్చిమ భారతదేశంలోని పలు సైనిక స్థావరాలపై దాడి చేసిందని భారత సైన్యానికి చెందిన కల్నల్ సోఫియా ఖురేషి ధృవీకరించారు. అయితే, పరిస్థితిని ఉద్రిక్తం చేసే ఉద్దేశం తమకు లేదని, పహల్గామ్ దాడికి ప్రతిస్పందనగానే చర్యలు తీసుకున్నామని మిశ్రీ స్పష్టంచేశారు.
శుక్రవారం జరిగే ఐఎంఎఫ్ సమీక్షలో తదుపరి విడత నిధులు పొందేందుకు పాకిస్థాన్ అవసరమైన షరతులను నెరవేర్చిందో లేదో నిర్ణయిస్తారు. ఈ నేపథ్యంలో ఐఎంఎఫ్‌లో భారత ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ప్రస్తుతం ప్రపంచ బ్యాంకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పరమేశ్వరన్ అయ్యర్ ఈ బాధ్యతలు నిర్వహిస్తున్నారు) దేశం వైఖరిని సమర్ధవంతంగా తెలియజేస్తారని మిశ్రీ విశ్వాసం వ్యక్తం చేశారు.