2047 నాటికి భారత్ ప్రపంచంలోనే అగ్రగామి ఆర్థిక వ్యవస్థగా మారుతుంది.. చంద్రబాబు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బలమైన నాయకత్వంలో భారతదేశం 2047 నాటికి ప్రపంచంలోనే అగ్రగామి ఆర్థిక వ్యవస్థగా మారనుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లండన్‌లో అన్నారు. మంగళవారం రాత్రి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ నిర్వహించిన వార్షిక లండన్ గ్లోబల్ కన్వెన్షన్‌లో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన చేసిన ప్రసంగంలో, తన రాష్ట్రం కోసం ప్రభుత్వ, ప్రైవేట్, ప్రజల భాగస్వామ్య నమూనా ద్వారా వ్యాపారం చేయడంలో ప్రధాని ఎంతగానో సహకరించారని చెప్పారు.
ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ (టిడిపి) అధినేత చంద్రబాబు తన సతీమణి, హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ వైస్ ప్రెసిడెంట్, మేనేజింగ్ డైరెక్టర్ నారా భువనేశ్వరికి ప్రతిష్టాత్మక ఐఓడి డిస్టింవిష్డ్ ఫెలోషిప్, కార్పొరేట్ గవర్నెన్స్‌లో ఎక్సలెన్స్ కోసం గోల్డెన్ పీకాక్ అవార్డును కూడా అందజేశారు.
ఆపై ఆయన మాట్లాడుతూ.. భారతదేశంలో మనకు కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. ఒకటి ఆర్థిక సంస్కరణలు, రెండవది ఐటి. మూడవది, మనకు ప్రధానమంత్రిగా చాలా బలమైన నాయకుడు నరేంద్ర మోడీ ఉన్నారు" అని చంద్రబాబు నాయుడు అన్నారు.
"ఇటీవల, మీరు మా జీఎస్టీ సంస్కరణలను చూశారు. నిర్మాణాత్మక లోపాలను మోదీ ఇప్పుడు సరిదిద్దుతున్నారు. తద్వారా ప్రజలు అదనపు ప్రయోజనాన్ని పొందుతున్నారు. భారతదేశం చాలా వేగంగా కదులుతోంది. ఇది ఇప్పుడు ఆటోపైలట్‌లో ఉంది. దీనిని ఆపలేము. నేటికి భారతదేశం నాల్గవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. 2047 నాటికి, భారతదేశం ప్రపంచంలోనే నంబర్ వన్ ఆర్థిక వ్యవస్థ అవుతుంది" అని చంద్రబాబు వెల్లడించారు.