శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 30 సెప్టెంబరు 2024 (12:59 IST)

అంతరిక్షం నుంచి భూమికి చేరుకోనున్న వ్యామగాములు

sunitha williams
అంతరిక్షంలో చిక్కుకునిపోయిన వ్యోమగాములు సునీతా విలియమ్స్, బచ్ విల్మెర్‌లు తిరిగి సురక్షితంగా రానున్నారు. వీరిని భూమికి తిరిగి తీసుకొచ్చేందుకు నాసా ప్రయోగించిన స్పేస్ఎక్స్ క్రూ డ్రాగన్ క్యాప్సూల్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)తో విజయవంతంగా డాకింగ్ అయింది. వారం రోజుల ప్రయోగాల కోసం వెళ్లి బోయింగ్ స్టార్ లైనర్ సాంకేతిక లోపాలు కారణంగా ఐఎస్ఎస్ చిక్కుకుపోయిన నాసా వ్యోమగాములిద్దరూ తిరిగి భూమికి చేరేందుకు మార్గం సుగమమైంది.
 
క్రూ-9 మిషన్‌లో భాగమైన క్రూ డ్రాగన్ క్యాప్సూల్‌‍ను శనివారం ఫ్లోరిడాలోని కేప్ కెనావెరల్ స్పేస్ ఫోర్స్ స్టేషన్ నుంచి ప్రయోగించారు. ఇందులో నాసా వ్యోమగామి నిక్ హాగ్, రష్యా కాస్మోనాట్ అలెగ్జాండర్ గోర్బునోవ్ ఉన్నారు. ఈ క్యాప్సూల్ ఆదివారం సాయంత్రం దాదాపు 5.30 గంటల సమయంలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం విజయవంతంగా డాకింగ్ అయింది. ఈ విషయాన్ని స్పేస్ఎక్స్ సీఈవో ఎలాన్ మస్క్ ధ్రువీకరించారు.
 
క్యాప్సూల్ డాకింగ్ విజయవంతమైన తర్వాత అందులోని వ్యోమగాములను సునీత విలియమ్స్ ఆహ్వానించారు. ఐఎస్ఎస్ ఇప్పటికే 9 మంది వ్యోమగాములు ఉండగా హాగ్, గోర్బునోవ్ రాకతో ఆ సంఖ్య 11కు చేరింది. సునీత, విల్మెర్లను తీసుకెళ్లిన బోయింగ్ స్టార్ లైనర్ సాంకేతిక కారణాలతో ఈ నెల మొదట్లో ఒంటరిగానే తిరిగొచ్చింది. దీంతో ఇప్పుడు స్పేస్ఎక్స్ క్రూ డ్రాగన్‌ను నాసా ప్రయోగించింది.