శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 5 నవంబరు 2024 (09:37 IST)

ప్రపంచ సునామీ అవగాహన దినోత్సవం.. హైదరాబాదులో ఇంకాయిస్.. థీమ్?

Tsunami
Tsunami
సునామీ హెచ్చరికలు మన హైదరాబాద్ నుంచే వెళ్తున్నాయని అందరికీ తెలియదు. సముద్రాల్లో ఏర్పడే భూ ప్రకంపనల నుంచి సునామీ రాక.. సముద్రపు అలల ఎత్తు, వేగం, వాటి తీవ్రత ఏమేర ఉంటుందో నిమిషాల్లో భారత్‌తో పాటు ఆయా దేశాలకు చేరవేసే ఇంకాయిస్ (భారత జాతీయ మహా సముద్ర సమాచార సేవా కేంద్రం) హైదరాబాదులోనే వుంది. 
 
ప్రపంచంలో మూడు దేశాల్లో సునామీ హెచ్చరిక కేంద్రాలు ఉంటే అందులో హైదరాబాద్‌లోని ఇంకాయిస్ ఒకటి. మిగతా రెండు ఇండోనేషియా, ఆస్ట్రేలియా దేశాల్లో ఉన్నాయి. నేడు "ప్రపంచ సునామీ అవేర్నెస్ డే". 2004లో వచ్చిన సునామీతో సుమారు 2,40,000 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. మరో 48,000 మంది కనిపించకుండాపోయిన సంగతి తెలిసిందే. దాదాపు 14 దేశాలపై సునామీ ప్రభావం కనిపించింది.
 
సునామీపై ముందస్తు సమాచారం అందించే కేంద్రం ప్రపంచ దేశాల్లో ఎక్కడా లేదు. దీంతో భారత ప్రభుత్వం కూడా తేరుకుని సునామీ హెచ్చరిక కేంద్రం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఆ మేరకు అప్పటికే ఇంకాయిస్ ద్వారా మహా సముద్ర సమాచార సేవలు అందుతుండడంతో దీనికి అనుబంధంగానే సునామీ హెచ్చరిక కేంద్రం నెలకొల్పింది. 
 
సునామీకి ముందు మొదట సముద్రంలో భూమి కంపిస్తుంది. అలా భూప్రకంపనలు జరిగిన 5-6 నిమిషాలకు ఇంకాయిస్‌కు సమాచారం అందుతుంది. సముద్ర భూభాగంలో అమర్చిన సిస్మో మీటర్ల ఆధారంగా శాటిలైట్ ద్వారా భూకంపనలు జరిగిన సమాచారం ఇంకాయిస్‌కు చేరుతుంది. 
 
ఆ తర్వాత భూకంపం ప్రభావంతో సునామీ ఉత్పన్నమయ్యే అవకాశం ఉందా? లేదా? అనే దానిపై దృష్టి సారిస్తారు. సముద్ర జలాలకు కొద్ది కి.మీ దూరంలో ఏర్పాటుచేసిన "సునామీ బోయ్ నెట్వర్క్" పరికరాల ఆధారంగా కెరటాల ఎత్తు, వాయు దిశను పరిశీలించి సునామీని గుర్తిస్తారు. ఆపై అప్రమత్త చర్యలు చేపట్టేందుకు ప్రభుత్వాలకు సమాచారం అందిస్తారు. 
 
సునామీ వచ్చేసమయంలో సంకేతాలు ఏవిధంగా ఉంటాయి, ప్రకృతిపరంగా జరిగే మార్పులు, ప్రమాదం నుంచి బయటపడేందుకు అనుసరించాల్సిన జాగ్రత్తలపై ఇంకాయిస్ అవగాహన కల్పిస్తోంది. 
 
ప్రపంచ సునామీ అవేర్‌నెస్ డేని డిసెంబర్ 2015లో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ ప్రకటించింది. 1854లో, జపాన్ తీరంలో భారీ భూకంపం సంభవించి సునామీని ప్రేరేపించింది. ఒక స్థానిక గ్రామ నాయకుడు రాబోయే అలల సంకేతాలను గమనించాడు.
 
ఎత్తైన ప్రదేశాలకు పారిపోయేలా గ్రామస్థులను హెచ్చరించాడు. అతను తన అత్యంత విలువైన ఆస్తులలో ఒకటైన తన వరి కుచ్చుల గొడౌన్‌ను తగులబెట్టాడు. ఈ నిస్వార్థ చర్య లెక్కలేనన్ని ప్రాణాలను కాపాడింది. ప్రకృతి వైపరీత్యాల నేపథ్యంలో ఈ సంసిద్ధత పలువురు ప్రాణాలను రక్షించింది. 
 
ప్రపంచ అవేర్‌నెస్ డే 2024 థీమ్- విపత్తుల ప్రభావానికి లోనైన దుర్బల వర్గాలకు మద్దతు ఇవ్వడం. 'స్థిరమైన భవిష్యత్తు కోసం అసమానతతో పోరాడటం'.