శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 8 అక్టోబరు 2024 (16:26 IST)

మంత్రి కొండా సురేఖపై పరువు నష్టం దావా కేసు : నాంపల్లి కోర్టులో నాగార్జున వాంగ్మూలం

nagarjuna
తెలంగాణ రాష్ట్ర మంత్రి కొండా సురేఖపై దాఖలు చేసిన పరువు నష్టం దావా కేసులో హీరో అక్కినేని నాగార్జున తన వాంగ్మూలం ఇచ్చేందుకు హైదరాబాద్ నాంపల్లి కోర్టుకు వచ్చారు. నాగార్జునతో పాటు.. ఈ కేసులోని సాక్షులు కూడా వాంగ్మూలం ఇచ్చారు. 
 
అక్కినేని నాగ చైతన్య - సమంత విడాకుల అంశంలో మంత్రి కొండా సురేఖ అనుచిత వ్యాఖ్యలు చేశారని సినీ నటుడు నాగార్జున నాంపల్లి కోర్టుకు తెలిపారు. రాజకీయ విమర్శల్లో భాగంగా మంత్రి సురేఖ మాట్లాడుతూ నాగార్జున, నాగచైతన్య, సమంతల పేర్లను ప్రస్తావించారు. 
 
ఈ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర దుమారం రేపింది. ఈ క్రమంలో నాగార్జున మంత్రిపై నాంపల్లి కోర్టులో క్రిమినల్‌ పరువునష్టం దావా వేశారు. ఆమె తమ కుటుంబ గౌరవాన్ని, ప్రతిష్ఠను దెబ్బతీసేలా నిరాధార వ్యాఖ్యలు చేశారని, ఆమెపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని పిటిషన్‌లో కోరారు.
 
పిటిషన్ విచారణకు స్వీకరించిన న్యాయస్థానం తమ ఎదుట హాజరై వాంగ్మూలం ఇవ్వాల్సిందిగా నాగార్జునకు తెలిపింది. దీంతో ఆయన తన సతీమణి అమల, కుమారుడు నాగచైతన్యతో కలిసి నాంపల్లి కోర్టు ఎదుట హాజరయ్యారు. ఎందుకు పిటిషన్ దాఖలు చేశారని నాగార్జునను న్యాయస్థానం ప్రశ్నించింది. 
 
కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల వల్ల తమ కుటుంబ పరువు మర్యాదలకు భంగం వాటిల్లిందని ఆయన కోర్టుకు వాంగ్మూలం ఇచ్చారు. రాజకీయ దురుద్దేశంతోనే ఇలాంటి వ్యాఖ్యలు చేశారని, అన్ని టెలివిజన్‌ ఛానళ్లు, పత్రికల్లో ఆ వ్యాఖ్యలు వచ్చాయని తెలిపారు. అసత్య ఆరోపణలు చేసిన ఆమెపై క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలని కోర్టుకు విన్నవించారు. నాగార్జున ఇచ్చిన స్టేట్‌మెంట్‌ను కోర్టు రికార్డు చేసింది.