శుక్రవారం, 28 నవంబరు 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 27 నవంబరు 2025 (22:39 IST)

వేధింపులు ధైర్యంగా ఎదుర్కోండి.. మహిళలకు ఐష్ పిలుపు

Aishwarya Rai Bachan
బహిరంగ ప్రదేశాల్లో మహిళలకు ఎదురవుతున్న వేధింపుల (స్ట్రీట్ హరాస్‌మెంట్) ఘటనల్లో బాధితులనే నిందించే ధోరణిపై బాలీవుడ్ నటి ఐశ్వర్య రాయ్ బచ్చన్ ఘాటుగా స్పందించారు. జరిగిన దానికి మీ దుస్తులలో, మీరు పెట్టుకున్న లిప్‌స్టిక్‌నో నిందించవద్దని, వేధింపులు ఎపుడూ మీ తప్పు కాదని, వీటిని ధైర్యంగా ఎదుర్కోవాలని ఆమె పిలుపునిచ్చారు. 
 
తాను గత దశాబ్దకాలంగా ప్రచారకర్తగా వ్యవహరిస్తున్న ఓ ప్రముఖ బ్యూటీ బ్రాండ్ నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో ఆమె పాల్గొని ప్రసంగించారు. దీనికి సంబంధించిన వీడియోను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేశారు. మీరు బయటి ప్రదేశాల్లో వేధింపులు ఎలా ఎదుర్కొంటున్నారు అని ప్రశ్నిస్తూ ఆమె తన సందేశాన్ని ప్రారంభించారు. 
 
సమస్యను ధైర్యంగా ఎదుర్కొంటూ, సూటిగా కళ్లలోకి చూడండి. తల ఎత్తుకుని ధైర్యంగా నిలబడండి. మీ శరీరం, మీ గౌరవం మీ సొంతం. మీ విలువ విషయంలో ఎపుడూ రాజీపడొద్దు. మీ ఆత్మవిశ్వాసాన్ని ఎపుడూ శంకించకండి. మీ గౌరవం కోసం పోరాడండి. వేధింపులు ఎప్పటికీ మీ తప్పు కానే కాదు అని ఐశ్వర్య స్పష్టం చేశారు. మరీ ముఖ్యంగా వేధింపులకు చూపు తిప్పేసుకోవడం, వెనుకంజ వేయడం వంటి పాత పద్ధతులను విడిచిపెట్టాలని సూచించారు. 
 
సాధారణంగా మహిళల సమస్యలపై ఐశ్వర్య రాయ్ ధైర్యంగా స్పందిస్తారనే పేరుంది. ఆమె తాజా వ్యాఖ్యలకు సోషళ్ మీడియాలో మద్దతు భారీగా లభిస్తోంది. మహిళలు, యువతులందరికీ ఇది ఎంతో శక్తిమంతమైన సందేశం, అమ్మాయిలకు మీరు స్ఫూర్తి అంటూ నెటిజన్లు పలు విధాలుగా కామెంట్స్ చేస్తున్నారు.