శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 6 జూన్ 2024 (12:46 IST)

పవన్ కళ్యాణ్ విజయం కోసం శ్రమించిన ఆ ముగ్గురు సినీ ప్రముఖులు!!

pawan - trivikram
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి అఖండ విజయం సాధించడం వెనుక చంద్రబాబు నాయుడు అనుభవం, పవన్ కళ్యాణ్ దూకుడు ప్రధాన అస్త్రాలుగా ఉన్నాయి. ముఖ్యంగా, పవన్ కళ్యాణ్ గేమ్ ఛేంజర్‌, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అంటూ జాతీయ మీడియాతో పాటు.. రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ రాజకీయ క్షేత్రంలో సమతూకంగా ఉంటూ కూటమిని నడిపించిన తీరు, వందశాతం విజయాన్ని అందుకున్న విధానం ప్రశంసలను కురిపిస్తుంది. గత పదేళ్లుగా వ్యక్తిగతంగా ఎన్నో విమర్శలను సవాళ్లను ఎదుర్కొన్న పవన్ కల్యాణ్, వాటన్నింటికి ఈ  విజయంతో సమాధానమిచ్చినట్లు అయింది.‌ 
 
అయితే ఇన్నాళ్ళు అపజయాలు ఎదురైనా.. పవన్ వెనుకడుగు వేయకుండా, ఈ ఎన్నికలలో విజయాన్ని సాధించటం వెనుక ముగ్గురు సినీ ప్రముఖులు కీలకంగా నిలిచారు.‌ పవన్ వెనుక అన్నివిధాలుగా అండగా ఉన్న వ్యక్తి సోదరుడు, సినీ నటుడు నాగబాబు. ఈ సారి ఎన్నికలలో పోటీ నుంచి తప్పుకుని మరీ పవన్ విజయం కోసం క్షేత్రస్థాయిలో తీవ్రంగా వర్క్ చేశారు. క్యాడర్‌ను కూడగట్టుకుని, పవన్‌కు కూటమి ఓట్లను సమీకరించటంలో సక్సెస్ అయ్యారు. ఇప్పుడు కూటమి అధికారంలోకి రావటంతో నాగబాబుకు రాజ్యసభ సీటు ఇచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.
 
మరోపక్క పిఠాపురంలో పవన్‌కు సపోర్టుగా మెగా హీరోలు, జబర్దస్త్ నటులు స్వచ్చందంగా వచ్చి ప్రచారం చేశారు. ఆ ప్రచారాన్ని నియోజకవర్గంలో ప్రతి ఇంటికి, వ్యక్తికి రీచ్ అయ్యేలా సినీ దర్శకుడు మోహర్ రమేష్ కృషి చేశారు. పవన్ ఇతర నియోజకవర్గాలలో‌ ప్రచారం చేసుకున్నా‌, రాష్ట్రవ్యాప్తంగా పిఠాపురంపై అందరి‌ ఫోకస్ పడటానికి మోహర్ రమేష్ ప్లానింగ్ బాగా ఉపయోగపడింది.‌
 
ఇక మూడో వ్యక్తి సినీ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఇక తొలినుంచి పవన్ కల్యాణ్ ఓ స్నేహితుడిగా ఉంటూ వ్యక్తిగతంగా పార్టీ పరంగా సలహాలు సూచనలు ఇస్తూ వస్తూన్నారు. పవన్ కల్యాణ్ ఆవేశపూరిత స్పీచ్‌ల వెనుక కంటెంట్ క్రియేటర్ త్రివిక్రమ్ అన్నది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ ఎన్నికల కోసం క్రియేట్ చేసిన హాయ్ ఏపీ.. బై బై వైసిపి నినాదం బాగా హైలైట్ అయింది. ఎక్కడ ప్రచారానికి వెళ్లినా డీజే పెట్టి మరీ పవన్ ఈ స్లోగన్‌ను ప్లే చేస్తూ ఊగిపోయారు. ఈ నివాదాన్ని ప్రజల్లోకి తొచ్చుకువెళ్లెలా చేయగలిగారు. ఇలా పవన్ విజయం వెనుక ముగ్గురు సినీ ప్రముఖులు కీలకంగా వ్యవహరించారు. 
 
ఇక పవన్ మీద అభిమానంతో జనసేన పార్టీకి అండంగా నిలిచిన నిర్మాతలు ఉన్నారు. పవన్ కల్యాణ్‌తో సినిమాలు నిర్మించిన, నిర్మిస్తున్న బివిఎస్ఎన్ ప్రసాద్, ఎ.ఎం.రత్నం, నాగవంశీ, దానయ్య లాంటి నిర్మాతలు సినిమా చిత్రీకరణలను కూడా పక్కన‌పెట్టి‌ పవన్ కల్యాణ్ విజయం కోసం తమదైన సహాయసహకారాలను అందించారు. అన్నింటిని మించి ఎన్నికలకు ముందు తొలిసారి మెగాస్టార్ చిరంజీవి నేరుగా పవన్ కల్యాణ్‌కు వ్యక్తిగతంగా తన మద్దతును ప్రకటించి, అసెంబ్లీలో నా తమ్ముడు అడుగుపెట్టాలని కోరటం.. క్యాడర్‌కు కొండంత బలాన్ని అందించింది.