మంగళవారం, 11 ఫిబ్రవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 8 ఫిబ్రవరి 2022 (15:07 IST)

సీఎం జగన్‌తో చిరంజీవి భేటీ వ్యక్తిగతమా? పరిశ్రమ కోసమా?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, వైకాపా అధినేత వైఎస్. జగన్మోహన్ రెడ్డితో సినీ నటుడు, మెగాస్టార్ చిరంజీవి ఈ నెల 10వ తేదీన సమావేశంకానున్నారు. ఏపీలో సినిమా టిక్కెట్ల ధరల తగ్గింపుపై వివాదం సాగుతోంది. ఇదే అంశంపై సీఎం జగన్‌తో చిరంజీవి ఇప్పటికే రెండుసార్లు సమావేశమై చర్చించారు. ఈ సమావేశం తర్వాత మంచి నిర్ణయం త్వరలోనే వెలువడే అవకాశం ఉందని చెప్పారు. 
 
ఈ నేపథ్యంలో సీఎం జగన్‌తో చిరంజీవి ఈ నెల 10వ తేదీన మరోమారు సమావేశంకానున్నారు. నిజానికి ఈ సమావేశం గతవారమే జరగాల్సింది. కానీ, చిరంజీవి కరోనా వైరస్ బారినపడటంతో ఈ భేటీ వాయిదాపడింది. తాజా సమాచారం మేరకు ఈ నెల 10వ తేదీన సీఎం జగన్‌తో చిరంజీవి భేటీ కావడం ఖాయమైంది. 
 
అంతేకాకుండా, సీఎంని కలిసేముందు సినీ పెద్దలతో కూడా చిరంజీవి సమావేశం కానున్నారనే వార్తలు వెలువడుతున్నాయి. వారి అభిప్రాయాలను కూడా తెలుసుకుని, సీఎంకు వివరించాలని భావిస్తున్నారు. ఆ తర్వాత సీఎం జగన్ సినిమా టిక్కెట్ల ధరల వ్యవహారంపై సముచిత నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. 
 
వారిద్దరిది వ్యక్తిగత భేటీ 
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, మెగాస్టార్ చిరంజీవిల మధ్య జరిగిన భేటీని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడు మంచు విష్ణు వ్యక్తిగత భేటీగా అభివర్ణించారు. అదేసమయంలో సినిమా టిక్కెట్ల అంశంపై చిత్రపరిశ్రమ మొత్తం ఏకతాటిపైకి రావాలని ఆయన పిలుపునిచ్చారు. 
 
ఆయన సోమవారం తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ, చిత్రపరిశ్రమ అభివృద్ధికి రెండు తెలుగు రాష్ట్రాలు మంచిగానే సహకరిస్తున్నాయన్నారు. అయితే, ఏపీలో సినిమా టిక్కెట్ల వ్యవహారంలో మాత్రం చిత్ర పరిశ్రమ మొత్తం ఏకతాటిపైకి రావాలని ఆయన పిలుపునిచ్చారు.
 
ఈ వివాదంలో తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ నిర్ణయం మేరకు ముందుకు వెళ్లాతమని మంచు విష్ణు తెలిపారు. అంతేకానీ, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డితో విడిగా మాట్లాడి సమస్యను పక్కదారి పట్టించలేనని చెప్పారు. అయితే, జగన్, చిరంజీవి భేటీ అది వారి వ్యక్తిగతమన్నారు. 
 
సినిమా టిక్కెట్ల ధరల వ్యవహారంపై ఒకరిద్దరు ప్రభుత్వంతో మాట్లాడి వివాదం చేయడం సబబు కాదన్నారు. అదేసమయంలో ఈ అంశంపై తనను ఎవరూ సంప్రదించలేదని అందువల్ల ఈ అంశంపై తాను వ్యక్తిగతంగా స్పందిచబోనని చెప్పారు. సమస్య పరిష్కారం కోసం సమిష్టిగా కృషి చేద్దామని ఆయన పిలుపునిచ్చారు.