గురువారం, 2 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 2 జనవరి 2025 (18:54 IST)

డాకు మహారాజ్ నుంచి బాలకృష్ణ, ఊర్వశి రౌతేలా పై దబిడి దిబిడి సాంగ్

Balakrishna and Urvashi Rautela
Balakrishna and Urvashi Rautela
నందమూరి బాలకృష్ణ కథనాయకుడిగా ఈ సంక్రాంతికి ఆయన 'డాకు మహారాజ్' చిత్రంతో ప్రేక్షకులను అలరించనున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం నుంచి ఇప్పటివరకు రెండు పాటలు విడుదల కాగా, రెండింటికీ మంచి స్పందన లభించింది. ఇక ఇప్పుడు మూడవ గీతం విడుదలైంది.
 
'డాకు మహారాజ్' చిత్రం నుంచి అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న మూడవ గీతం 'దబిడి దిబిడి'ని తాజాగా చిత్ర బృందం విడుదల చేసింది. విడుదలైన కొద్ది నిమిషాల్లోనే ఈ పాట సామాజిక మాధ్యమాల్లో ఒక ఊపు ఊపుతోంది. నందమూరి బాలకృష్ణ అంటే డైలాగ్ లకు పెట్టింది పేరు. అలాంటి బాలకృష్ణ చిత్రాలలోని అత్యంత ప్రజాదరణ పొందిన డైలాగ్ లతో రూపుదిద్దుకున్న 'దబిడి దిబిడి' గీతం అభిమానులకు నిజమైన విందును అందిస్తోంది. ఈ మాస్ నృత్య గీతాన్ని భారీ స్థాయిలో తెరకెక్కించారు. ఈ పాటలో బాలకృష్ణతో కలిసి ఊర్వశి రౌతేలా కాలు కదిపారు. తమ అసాధారణ ఎనర్జీతో, అదిరిపోయే స్టెప్పులతో మాస్ ప్రేక్షకులు మెచ్చేలా పాటను మలిచారు.
 
నందమూరి బాలకృష్ణ సినిమా అంటే తమన్ ఏ స్థాయిలో సంగీతం అందిస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీరి కలయికలో వచ్చే ప్రతి పాట ప్రేక్షకులని రంజింపచేస్తుంది. ఇప్పుడు 'దబిడి దిబిడి' కోసం తమన్ మరోసారి అద్భుతమైన సంగీతాన్ని అందించారు. వాగ్దేవి తన శక్తివంతమైన గాత్రంతో పాటను మరో స్థాయికి తీసుకెళ్ళారు. ఇక ప్రతిభావంతులైన గీత రచయిత కాసర్ల శ్యామ్ సాహిత్యం గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. సంగీతానికి తగ్గట్టుగా డైలాగ్ లతో అద్భుతమైన సాహిత్యం అందించారు. సంగీతం, సాహిత్యం చక్కగా కుదిరి.. ఇది గొప్ప నృత్య గీతంగా మారింది. "జై బాలయ్య" తరహాలో అభిమానుల హృదయాల్లో ఈ పాట నిలిచిపోతుంది అనడంలో సందేహం లేదు. విజయ్ కార్తీక్ కన్నన్ అద్భుతమైన విజువల్స్, శేఖర్ వీజే అదిరిపోయే కొరియోగ్రఫీ ఈ పాటను నిజమైన మాస్ ట్రీట్ లా మార్చాయి. అభిమానులతో పాటు, అన్ని వయసుల వారు కాలు కదిపేలా ఉన్న ఈ గీతం, ఖచ్చితంగా చాలా కాలం వినిపించే పాటగా నిలుస్తుంది.
 
నందమూరి అభిమానులతో పాటు, సినీ ప్రియులకు ఒక గొప్ప అనుభూతిని అందించేలా డాకు మహారాజ్ చిత్రాన్ని దర్శకుడు బాబీ కొల్లి రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో బాబీ డియోల్, ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, చాందిని చౌదరి, ఊర్వశి రౌతేలా ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. విజయ్ కార్తీక్ కన్నన్ ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తుండగా, నిరంజన్ దేవరమానే, రూబెన్ ఎడిటింగ్‌ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
 
సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీకరా స్టూడియోస్ సమర్పిస్తోంది. సంక్రాంతి కానుకగా జనవరి 12, 2025 న ప్రపంచ వ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది. యాక్షన్, వినోదం, భావోద్వేగాల మేళవింపుతో రూపొందిన డాకు మహారాజ్ చిత్రంతో ప్రేక్షకులను గొప్ప సినిమా అనుభూతిని అందిస్తామని చిత్ర బృందం నమ్మకంగా ఉంది.
 
తారాగణం: నందమూరి బాలకృష్ణ, బాబీ డియోల్, ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, చాందిని చౌదరి, ఊర్వశి రౌతేలా