ఫిబ్రవరి 6న తెలుగు సినిమా పుట్టిన రోజుగా చేయాలని నిర్ణయించింది తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్. ఇకపై ప్రతి యేడాది ఈ రోజును తెలుగు సినిమా పుట్టిన రోజుగా నిర్వహించాలని నిర్ణయించారు. ప్రభుత్వం అందించే అవార్డులతో పాటు, ఛాంబర్ తరఫు నుంచి వివిధ కేటగిరీల్లో అవార్డులు కూడా అందించాలనే నిర్ణయం జరిగింది. తెలుగు సినిమా పుట్టినరోజున ప్రతి సినిమా నటుడు ఇంటిపై, థియేటర్ల వద్ద ప్రత్యేకంగా జెండా ఆవిష్కరించాలని నిర్ణయం జరిగింది.
ఈ జెండా రూపకల్పన బాధ్యతను సీనియర్ రచయిత పరిచూరి గోపాలకృష్ణకు అప్పగించింది ఫిల్మ్ ఛాంబర్. తొలి తెలుగు టాకీ సినిమాకు సంబంధించి వివరాలను ఎంతో రీసెర్చ్ చేసి భక్త ప్రహ్లాద గురించి తెలిపిన సీనియర్ జర్నలిస్ట్ రెంటాల జయదేవ కృషిని గుర్తు చేసుకుంటూ.. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ భరత్ భూషణ్ ఆధ్వర్యంలో ఇదే వేదికపై ఆయన రచించిన మన సినిమా ఫస్ట్ రీల్ అనే పుస్తకాన్ని ఆవిష్కరించడం జరిగింది.
సీనియర్ రైటర్ పరుచూరు గోపాలకృష్ణ అధ్యక్షతన నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఛాంబర్ ప్రెసిడెంట్ దామోదర ప్రసాద్ మాట్లాడుతూ.. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ తరఫున తెలుగు సినిమా దినోత్సవం మొదటిసారి చేయడం జరుగుతుంది. అంతకు ముందు కొన్ని సంస్థలు చేశాయి. ఈయేడాది నుంచి ఛాంబర్ తరఫు నుంచి చేయాలని నిర్ణయించుకున్నాం. సినిమా అనేది మా అందరికీ తల్లి లాంటిది. తెలుగు సినిమా ఛాంబర్ మదర్ బాడీ ఇక నుంచి ప్రతి సంవత్సరం చేయాలని డిసైడ్ చేశాం. మొదటి యేడాది కాబట్టి ఈ సారి నార్మల్ గా చేస్తున్నాం. నెక్ట్స్ ఇయర్ నుంచి గ్రాండ్ గా నిర్వహించబోతున్నాం.
పాత తరం కళాకారులకు మరిన్ని సన్మానాలు చేస్తాం. సినిమా హిస్టరీ గురించి చెబితే.. సినిమా అనేది ఫస్ట్. బర్త్ ఆఫ్ సినిమా ముఖ్యం. చాలామంది ఎన్నో చరిత్రలు క్రియేట్ చేశారు. కానీ బర్త్ ఆఫ్ సినిమా అనేది ముఖ్యం. రాబోయే తరాలు కూడా ఇది గుర్తుంచుకోవాలి. జనాలు వస్తుంటారు పోతుంటారు. కానీ పుట్టుక అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరూ ఇది గుర్తుంచుకోవాలి. ఇక ఈ రోజును గురించి పాతికేళ్ల పాటు రీసెర్చ్ చేసి మొదటి తెలుగు టాకీ సినిమా డేట్ ను ఖచ్చితంగా గుర్తించి ప్రపంచానికి తెలియజేసిన సీనియర్ జర్నలిస్ట్ రెంటాల జయదేవ్ గారికి థ్యాంక్స్ చెబుతున్నాను అన్నారు.
ఛాంబర్ సెక్రెటరీ ప్రసన్నకుమార్ మాట్లాడుతూ.. ఇవాళ సినిమా పుట్టిన రోజు. ఫస్ట్ టాకీ ఫిల్మ్ భక్త ప్రహ్లాద. ఈచిత్రానికి హెచ్ఎమ్ రెడ్డి దర్శకుడు. ఈ చిత్రానికి ముందు వేరే వేరే డేట్ అనుకునేవాళ్లం. రెంటాల జయదేవ్ గారు పరిశీలించి ఈ రోజు అని చెప్పడంతో సెలబ్రేట్ చేసుకుంటున్నాం. భక్త ప్రహ్లాద కంటే ముందే కాళిదాసు అనే సినిమా 1931లో వచ్చింది. కాళిదాసు చిత్రంలో నాలుగు రీళ్లు తెలుగులోనే పాటలు, డైలాగులు ఉండి.. తెలుగు దర్శకుడు హెచ్ఎమ్ రెడ్డి దర్శకుడు.. తెలుగువాడైన గంగాధర్ హీరోగా నటించారు. తర్వాత మూడు రీళ్లు తమిళ్ లో ఉండటం కనిపిస్తుంది. ఈ కారణంగా కాళిదాసును తమిళ్ వాళ్లు వాళ్ల సినిమాగా చెప్పుకుంటున్నారు. కానీ వాస్తవంగా కాళిదాసు మన తెలుగు సినిమా. ఫస్ట్ హిందీ టాకీ మూవీ ఆలం ఆరా లో మన ఎల్వీ ప్రసాద్ గారు నటించారు. తెలుగు ఫస్ట్ టాకీ భక్త ప్రహ్లాద, తెలుగు, తమిళ్ ఫస్ట్ టాకీ కాళిదాసు.. ఈ మూడు చిత్రాల్లోనూ ఎల్వీ ప్రసాద్ గారు నటించారు.
ఆయన ఆ రోజుల్లో మూకీ నుంచి టాకీ వరకూ యాక్ట్ చేసి.. చాలా కష్టపడి.. ఏడు రోజులు భోజనం లేకుండా బ్రతికి ఈ రోజు ఇంత స్థాయికి వచ్చిన గొప్ప వ్యక్తి ఎల్వీ ప్రసాద్. ఆయనే ఎన్టీ రామారావుగారిని పరిచయం చేశారు. ఇవాళ ప్యాన్ ఇండియా అంటున్నాం. కానీ ఆ రోజుల్లో పాతాళ భైరవి ఎన్టీఆర్ నటించిన 6వ సినిమా. ఇది ఆ రోజుల్లోనే తెలుగు, తమిళ, హిందీ భాషల్లోనూ సూపర్ హిట్ అయ్యి ప్యాన్ ఇండియా సినిమా అనిపించుకుంది. మొదటి తరాల్లో సన్నగా ఉన్నవారికే అవకాశాలు అనుకున్నారు. కానీ తర్వాత ఎన్టీఆర్ లాంటి భారీ మనుషులు, నాగేశ్వరరావు లాంటి వ్యక్తులు వచ్చినప్పుడూ కొన్ని విమర్శలు వచ్చినా.. తర్వాత ఆ ఇద్దరూ తెలుగు సినిమాకు రెండు కళ్లుగా మారడం అనే చరిత్ర చూశాం. ఇక రాజకీయాల్లో ఎన్టీఆర్ సృష్టించిన చరిత్ర గొప్పదే. ఎలా చూసినా ప్రపంచ వ్యాప్తంగా తెలుగు సినిమా గొప్పదనం వ్యాపించి ఉన్న విషయాన్ని మనం గర్వంగా చెప్పుకుందాం.. అన్నారు.
సీనియర్ నటులు, నిర్మాత మురళీ మోహన్ మాట్లాడుతూ.. మనమంతా ఇండస్ట్రీ మీద బ్రతుకుతున్నవాళ్లం. ఒకప్పుడు నాగేశ్వరరావుగారు ఒక మాట అన్నారు. మేం వచ్చినప్పుడు చాలా పెద్ద పోటీ ఉండేది. మాకు సంస్కృతం మాట్లాడటం రాదు.. అప్పుడు వాళ్లు పాటలు కూడా పాడుకున్నారు. మాకు అవేవీ రాకున్నా.. ఎంతో హార్డ్ వర్క్ చేసి తర్వాత తరాలకు ఓ రోడ్ వేశాం. దానిపై మీరంతా హ్యాపీగా వెళుతున్నారు అన్నారు. అది నిజం. అలాంటి మహనీయులు చేసిన కృషే ఇది. మనం గర్వంగా చెప్పుకోదగ్గ వ్యక్తుల్లో ఎల్వీ ప్రసాద్ గారు ఆద్యుడు అని చెప్పాలి. ఆయనతో పాటు ఎందరున్నా.. ఎల్వీ ప్రసాద్ గారు హిందీ, బెంగాలీ చిత్రాల్లోనూ నటించి దర్శకుడుగానూ రాణించి సినిమా స్థాయిని పెంచారు.
ఇవాళ రాజకీయ నాయకులకంటే సినిమా వాళ్లకే ప్రజల్లో ఆదరణ ఎక్కువ. రాజకీయ నాయకుడు పదవికాలం పూర్తయ్యాక ప్రజల్లో ఆదరణ ఉండదు. క్రీడాకారులకు కూడా ఆదరణ అంతంత మాత్రమే. సినీ నటులు మాత్రం ఎప్పుడు ప్రేక్షకుల హృదయాల్లో ఉంటారు. ఫిబ్రవరి 6న తెలుగు సినిమా దినోత్సవాన్ని జరుపుకోవడం ఆనందంగా ఉంది. మద్రాసులో ఉన్నప్పుడు మేం సినిమా కులమని గర్వంగా చెప్పుకునేవాళ్లం. అలాంటి సినిమాకు సంబంధించి ప్రతి సంవత్సంర పండగ చేసుకోవాలి. ఇప్పటికైనా చేస్తున్నందుకు అందరినీ అభినందిస్తున్నాను. సినిమా పరిశ్రమలో అన్ని విభాగాల వాళ్లు సమన్వయం చేసుకుని నిర్వహిస్తే ఇంకా బావుంటుంది. తెలుగు సినిమాకు సంబంధించి భక్త ప్రహ్లాద ఫైనల్. ఫిబ్రవరి 6 అనే డేట్ బావుంది. మనమంతా సినిమా ప్రపంచంలో ఉన్నాం అని చెప్పుకోవడానికి గర్వపడాలి. ఎంతోమంది నిర్మాతల కృషి వల్లే మనమంతా ఈ స్థాయిలో ఉన్నాం. వచ్చే యేడాది ఈ పండగను గ్రాండ్ గా నిర్వహించుకుందాం.. అన్నారు.
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ మాదాల రవి మాట్లాడుతూ..ఫిబ్రవరి 6న తెలుగు సినిమా పుట్టిన రోజుగా జరుపుకోవాలని నిర్ణయించడం గొప్ప విషయం. నాటి నుంచి నేటి వరకూ ఎందరో గొప్ప నటులు వచ్చారు. ఎన్టీఆర్, ఏఎన్నార్ ఇండస్ట్రీ రెండు కళ్లు అని చెప్పుకుంటాం. వీరిలాంటి ఎందరో మహా నటులు, దర్శకులు, రచయితలు, నిర్మాతలు, గాయకులు.. మొత్తం 24 క్రాఫ్ట్స్ లో లెజెండ్స్ తో నిండిపోయింది. తెలుగు సినిమా ఇవాళ దశదిశలా వ్యాపించింది. తెలుగు సినిమా ఇప్పుడు ప్రపంచ సినిమా అయింది. అందుకు కారణం గొప్ప టెక్నీషియన్స్, దర్శకుల వల్లే అయింది. ఒకప్పుడు మనల్ని మదరాసీలు అనేవాళ్లు. అలాంటిది మన సినిమా వైపు యావత్ ప్రపంచ చూస్తోంది. ఈ ఖ్యాతిని పెంచడానికి ఎన్టీఆర్ కాలంనాటి నుంచి ప్రయోగాలు జరుగుతూనే ఉన్నాయి. తెలుగు సినిమా ఈ వందేళ్లో రంజింప చేయడమే కాదు.. ఆలోచింప చేయడంతో పాటు చైతన్యం తీసుకు వచ్చే ప్రయత్నమూ చేసింది. సమాజం మార్పు సినిమా వల్ల తెలుస్తుంది. ఇలాంటి ఎన్నో గొప్ప అంశాలతో ముడిపడి ఉన్న తెలుగు సినిమా పుట్టిన రోజును అన్ని సంఘాలూ కలిసి గ్రాండ్ గా నిర్వహించుకోవాలని.. ఈ పుట్టిన రోజు సందర్భంగా మా మా అసోసియేషన్ నుంచి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.. అన్నారు.
దర్శకుల సంఘం అధ్యక్షుడు వీర శంకర్ మాట్లాడుతూ.. కాళిదాసును తెలుగు సినిమా అని చెప్పుకోవడంలో కొంత వెనకబడ్డాం అనే చెప్పాలి. మొదటిసారిగా తెలుగు డైలాగులు స్క్రీన్ పైన వినిపించిన చిత్రం కాళిదాస్ కాబట్టి ఆ చిత్రాన్ని కూడా మనం ఓన్ చేసుకోవాలి. తెలుగు సినిమాకు పితామహుడైన హెచ్ఎమ్ రెడ్డి ఆ రోజున చేసిన ప్రయత్నమే ఈ పండగకు ఆద్యం. సినిమా చాలా శక్తివంతమైనది. ఒకప్పుడు రైతుబిడ్డ అనే చిత్రాన్ని చల్లపల్లి రాజా వారు నిర్మించారు. ఆ సినిమా చూసిన జనం రాజా వారిపైనే తిరుగుబాటు చేశారు. సినిమాకు అంత శక్తి ఉంది. క్రైమ్ సినిమాకు ముందు తర్వాత ఉంది. సినిమాల వల్ల క్రైమ్ పెరగడం లేదు. మనుషుల్లో ఉన్న నేర ప్రవృతినే సినిమాల ద్వారా చూపిస్తున్నాం. సినిమాలు సమాజాన్ని చెడగొట్టవు. సినిమా వాళ్ల గురించి తక్కువగా మాట్లాడే వారిపై ఫిల్మ్ ఛాంబర్ , నిర్మాతల మండలి కఠినంగా వ్యవహారించాలని కోరుకుంటున్నా అన్నారు.
తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ కార్యదర్శి అనుపమ్ రెడ్డి మాట్లాడుతూ.. అందరికీ తెలుగు సినిమా పుట్టిన రోజు శుభాకాంక్షలు. ఇది సాధారణంగా నిర్వహించాం. ఇవాళ బీజం వేశాం. రాబోయే రోజుల్లో మహా వృక్షంగా మారి అందరికీ తెలుగు సినిమా గొప్పదనం తెలిసేలా నిర్వహిస్తాం. ఈ సందర్భంగా రెంటాల జయదేవ్ గారికి ధన్యవాదాలు అన్నారు.
ఈ కార్యక్రమంలో తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ భరత్ భూషణ్, ముత్యాల రాందాస్, నిర్మాత ఆచంట గోపీనాథ్, తుమ్మలపల్లి రామ సత్యనారాయణ, పద్మజ, సీనియర్ ప్రొడ్యూసర్ వేమూడు సత్యనారాయణ, నిర్మాత సాంబశివరావు, ఫైటర్స్ యూనియన్ సెక్రటరీ అలెక్స్, శ్రీనివాస్, బి. బాపిరాజు, కే అమ్మిరాజు, సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.