R Narayana Murthy, Trivikram Srinivas
స్నేహ చిత్ర పిక్చర్స్ బ్యానర్ లో ఆర్ నారాయణ మూర్తి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం యూనివర్సిటీ (పేపర్ లీక్). ఈ చిత్రం ఆగస్టు 22 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న సందర్భంగా ప్రసాద్ ల్యాబ్ లో ప్రత్యేకంగా వీక్షించిన స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ మీడియా తో మాట్లాడారు.
ఆయన మాట్లాడుతూ: ఒకమాట మనం ఖచ్చితంగా మాట్లాడాలి ఆ మాట వినపడాలి. అంటే నొక్కబడే గొంతుల గురించి మాట్లాడడానికి ఒక గొంతు ఉంది. ఆ గొంతుఅందరికీ వినపడాలి. అది మనకి నచ్చవచ్చు నచ్చకపోవచ్చు. దానితో ఏకీభవించొచ్చు ఏకీభవించకపోవచ్చు. కానీ వాళ్ళు మాట్లాడాల్సిన అవసరం వుంది. అది మనం వినాల్సిన అవసరం వుంది. లేకపోతే ఏమీ జరుగుతుంది అంటే ప్రపంచంలో ఏక పక్ష ధోరణి రావడం వలన రాబోయే జనరేషన్స్ చాలా సంకుచితంగా తయారైపోతారు. అందుకని విభిన్నమైన గొంతుకలు విభిన్నమైన అభిప్రాయాలు…వీటిల్లోనే బ్యూటీ వుంది. అలాంటి ఒక పార్శ్వం, అలాంటి ఒక అందం ఆర్ నారాయణ మూర్తి గారు సొంతం. అది ఆయన తాలూకు శైలి. అది ప్రత్యేకం.
ఈ సినిమాకి వచ్చినప్పుడు కూడా నేను ఈ యూనివర్సిటీ పేపర్ లీక్ సినిమా ఎలా వుంది అని చెప్పాలి అంటే కార్డు పడిన వెంటనే రెండున్నర గంటలపాటు సినిమా చూడాలా అని భయపడ్డాను. ఎందుకంటే కరోనా తరువాత అందరూ కూడా ఏ సినిమా అయిన ఇరవై నిమిషాలు ముప్ఫై నిమిషాలు చూడలేకపోవడం అనే ఒక ఆసహనం లో వుంది ప్రపంచం. అలాంటి సినిమా రెండు గంటలు చూస్తే అలా పరిగెత్తుకెళిపోయింది.
పేపర్ లీక్ లు యూనివర్సిటీలు లేదంటే కాలేజీ రోజులు నుంచి విద్యాబోధన ఇంగ్లీషులో జరగాలా? తెలుగులో జరగాలా? విద్యార్థులు ఉద్యోగాల కోసం జాబ్ క్యాలెండర్స్ కోసం వెయిట్ చేయడం, అక్కడ కూడా లంచాలు ఇచ్చిన వాళ్ళకే ఉద్యోగాలు వస్తుంటే మిగతా వాళ్ల తాలూకు స్టూడెంట్స్ నిస్పృహఇందులో ఏది కూడా మనల్ని ఇమిడేట్ గా ఉత్తేజ పరిచే అంశాలు కాదు. ఆలోచింప అంశాలు లేకపోతే నిరాశ పరిచే అంశాలు అయినప్పటికీ కూడా సినిమాని బలంగా పట్టుగా నడిపించారు. నేను అనుకోవడం నారాయణ మూర్తి గారి సిన్సియారిటీ అనుకుంటున్నా. కేవలం మీ సిన్సియారిటీ మూలంగానే దాన్ని మేము దాన్ని మాట అనలేకపోతున్నాము. నారాయణమూర్తి గారిని అందరం ఎందుకు గౌరవిస్తారు అంటే వారి అభిప్రాయం నచ్చో నచ్చకో ఈ రెండు కాదు. ఆయన చెప్పే తీరు. మీ అభిప్రాయాన్ని మీరు ముందుకు తీసుకెళ్లడంలో మీకున్న నిబద్ధత మీకున్న సిన్సియారిటీ దాన్ని మాత్రం ఎవ్వరు ప్రశ్నించలేరు. అది మాత్రం నారాయణ మూర్తి గారి సొంతం. అలాంటి వాటి కోసమే నేను ఇపుడు వచ్చి మీ పక్కన నుంచున్నాను.
కేవలం మీ నిబద్ధత నచ్చే దానికి గౌరవం ఇచ్చే. ఇంతలా రాజీ పడకుండా బతకడం అందరి వల్ల కాదు. నావల్లకూడా కాదు. నేను చాలా సార్లు రాజీ పడ్డాను. నారాయణమూర్తి గారిలా రాజీ పడకుండా బతకడం అందరి వల్ల కాదు. ఆ విషయంలో నాకు కొంత జలసి కూడా వుంది. అలా బ్రతకడం అంత తేలిక కాదు. అందుకనే ఆయన పక్కన నిలబడి .. నా అమూల్యమైన సమయం అన్నారు కానీ తన అమూల్యమైన సమయాన్ని వెచ్చించి నాకు సినిమా చూపించారు. ఏర్ సినిమా గురించి మాట్లాడమని అవకాశం కల్పించినందుకు నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను.
ఈ సినిమా ఆగస్టు 22 న రిలీజ్ అవుతోంది. దీన్ని థియేటర్స్ లో చూడండి. ఇలాంటి సినిమాలు ఎందుకు బతకాలి అంటే ఆర్ నారాయణ మూర్తి గారు మరిన్ని సినిమాలు తీయాలి. ఎందుకంటే ఈయన అర్ధరాత్రి స్వాతంత్ర్యం నాకు తెలుసు. ఒరేయ్ రిక్షా నాకు తెలుసు. చాలా సూపర్ హిట్స్ కొట్టారు నారాయణమూర్తి గారు సూపర్ స్టార్ ఆయన శైలి లో. ఇపుడుకూడా చెపుతున్నా ఆ స్టార్ ప్రెజెన్స్ అయితే వుంది. మీకు తెలిసో లేదో ఒక సినిమాలో క్యారెక్టర్ కి మిమ్మల్ని అనుకున్నాము. కానీ నాకు మీరు ఆ క్యారెక్టర్ చేయరు అని చెప్పారు. చెప్పిన వాళ్ళు ….. మీరు రెమ్యునరేషన్ ఆఫర్ చేసి ఆర్ నారాయణమూర్తి ని కొనలేరు అన్నారు. ఇలాంటి విషయాలు మీరు చెపితేనే జనాలు ఎందుకు వింటారు అంటే నారాయణ మూర్తి డబ్బులు కోసమో సక్సెస్ కోసమో చెప్పరు. నిజంగా ప్రజలకు తెలియ చేయాలని చెపుతారు కాబట్టి దాన్ని చూడడానికి వస్తారు. దాన్ని గౌరవిస్తారు. నేను కూడా రెండు గంటలపాటు ఎందుకు గౌరవించి చూసి ఇక్కడకొచ్చి మాట్లాడుతున్నాను అంటే దానికోసమే. ఈ సినిమా ఆడాలి. నెక్స్ట్ సినిమా ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి ఇంకా మంచి ప్రీడక్షన్ వాల్యూస్ తో తీయడానికి అవకాశం కలిగేలా ఈ సినిమా మీకివ్వాలి అని అలాంటి సక్సెస్ వస్తుందని కోరుకుంటున్నాను.
ఈ సినిమాలో గద్దర్ గారి పాట నాకు బాగా నచ్చింది. ఆ పాట గద్దర్ గారు రాశారు అని చెప్పిన తరువాత ఇంకా ఆనందం వేసింది. నాకు ఇష్టమైన రచయిత ఆయన. తాత తాత ముత్తాతలు సాంగ్. నాకు నచ్చింది ఈ సినిమా మీకు కూడా నచ్చుతుంది. విద్యార్థుల భవిష్యత్ కోసం వీరి వర్తమానన్ని తాకట్టు పెట్టిన తల్లిదండ్రులకి చాలా ఉక్కిరి బిక్కిరిగా వుంది. ఇదొక విష సంస్కృతి అనాలా అసలు మనం దేని వెనకాల ఒరిగెడుతున్నాము. చదువు వల్ల వచ్చే సక్సెస్ వెనకాల లేదా జ్ఞానం వెనకాల…. జ్ఞానం వెనకాల పరిగెడుతుంటే ఇంత డబ్బులు విసిరేసి పరిగెత్తాలా? ఆ ప్రశ్న అయితే వచ్చింది. జ్ఞానం మనకు ఆనందాన్ని ఇవ్వాలి. ఇంత నొప్పి ఎందుకొస్తుంది ఇంత బాధ ఎందుకొస్తుంది. మనల్ని కన్నా వాళ్ళకి ఎందుకు ఇంత కష్టాన్ని ఇస్తుంది.
నేను కూడా ఇంజనీరింగ్ లో ప్రవేట్ కాలేజ్ లో ర్యాంక్ వచ్చింది. మేము నలుగురు పిల్లలం. మా నాన్న చదివించలేను అన్నారు. ఆయన తేలికగా చెప్పారో లేక నేను తేలికగా తీసుకున్నానో పట్టించుకోకుండా నేను బియాస్సీ చదివేశాను. కానీ ఇప్పుడు చూస్తుంటే అప్పుడున్నంత తేలికగా సమాజం లేదు మనుషులు కూడా అంత తేలికగా సుఖంగా లేరు ఎందుకంత బరువుగా వున్నారు. అంటే మనం పిల్లలమీద అంతా ఒత్తిడి పెట్టేస్తున్నాం. ఈ సినిమాలో పెట్టారు అన్నం తినే టైమ్ లో పుస్తకం చదివితే బెటర్ కదా అని మదర్ చెప్పడం ముద్ద నేను కలిపి పెడతాను నువ్వు చదువుకో అంటుంది. అంతా ఒత్తిడి పిల్లల మీద ఎందుకు పెట్టేస్తున్నారు? పిల్లల భవిష్యత్ గురించి పెద్ద వాళ్ళ వర్తమానాన్ని ఎందుకు తాకట్టు పెట్టేస్తున్నారు? ఆ పాయింట్ నాకు బాగా నచ్చింది ఈ సినిమాలో. అందరూ ఈ సినిమా తప్పకుండా చూడండి అని అన్నారు.
పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణ మూర్తి మాట్లాడుతూ: నేను అడిగిన వెంటనే ఒప్పుకొని ఇక్కడకు వచ్చి నేను తీసిన యూనివర్సిటీ పేపర్ లీక్ సినిమా చూసిన ప్రముఖ దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి కి ధన్యవాదములు. సినిమా నచ్చింది అని చెప్పారు సంతోషం. విద్యను ప్రవేటు మాఫియా కబంధ హస్తాల నుంచి విముక్తి చేసి విద్యను జాతీయం చేయాలి. ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయాలి.అని చాటి చెప్పేదే ఈ యూనివర్సిటీ పేపర్ లీక్ చిత్రం. ఆగస్టు 22 న ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నాము అని అన్నారు.
నటీనటులు - ఆర్. నారాయణ మూర్తి, వైఎస్ కృష్ణేశ్వర్ రావు, తిరుపతి నాయుడు, విజయ్ కుమార్ మరియు నూతన తారాగణం.
పాటలు - గద్దర్ - జలదంకి సుధాకర్, - వేల్పుల నారాయణ.-మోటపలుకులు రమేష్,
ఎడిటింగ్ - మాలిక్
కెమెరా - బాబూరావు దాస్
కథ-స్క్రీన్ ప్లే - మాటలు - సంగీతం - దర్శకత్వం - నిర్మాత
ఆర్. నారాయణ మూర్తి