శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Updated : శనివారం, 21 సెప్టెంబరు 2024 (12:17 IST)

జానీ మాస్టర్ 4 ఏళ్లుగా అత్యాచారం చేస్తూనే వున్నాడు: రిమాండ్ రిపోర్ట్

Jani Master
అత్యాచారం ఆరోపణలతో టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన టాప్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు రిమాండ్ రిపోర్ట్ రూపొందించారు. అందులో వున్న అంశాల ప్రకారం... ఆంధ్ర ప్రదేశ్ లోని నెల్లూరు జిల్లాకు చెందిన షేక్ జానీ బాషా అలియాస్ జానీ మాస్టర్ డ్యాన్సులో ట్రెయినింగ్ తీసుకుని 2000 సంవత్సరంలో తెలంగాణ రాజధాని హైదరాబాదు వచ్చాడు. ఏడేళ్లపాటు సహాయ నృత్యం చేస్తూ వచ్చిన ఆయనకు 2009లో డాన్స్ డైరెక్టరుగా అవకాశం వచ్చింది. ఈ క్రమంలో టీవీ షోలలో ఆయనను న్యాయ నిర్ణేతగా కూడా పిలవడం ప్రారంభమైంది. అలా 2017లో ఉత్తరాదికి చెందిన ఓ బాలిక టీవీ డ్యాన్స్ షోలో పాల్గొనేందుకు వచ్చింది. ఐతే పోటీలో ఆమె మధ్యలోనే నిష్క్రమించింది.
 
ఆ బాలిక డ్యాన్స్ మూవ్‌మెంట్స్ చూసిన జానీ మాస్టర్ ఆమెకి తన సహాయకుడి ద్వారా ఫోన్ చేయించి తన వద్ద పనిచేస్తే కెరీర్లో వున్నతంగా ఎదిగేందుకు సహాయపడతానని మాటిచ్చాడు. 2020 డిసెంబరు నెలలో తన సహాయకులతో పాటు ఆమెను ముంబయి తీసుకెళ్లాడు. పేరు నమోదు చేసుకునేందుకు గాను ఆమెకి సంబంధించిన ఆధార్, ఇతర పత్రాలు తీసుకున్నాడు. అదేరోజు అర్థరాత్రి ఆమెకి ఫోన్ చేసి ఆ పత్రాలు తిరిగి ఇచ్చేందుకు గదికి వస్తున్నట్లు చెప్పాడు. అలా గదిలోకి ప్రవేశించిన జానీ మాస్టర్ బాలికపై అత్యాచారం చేసాడు.
 
ఈ విషయం బయటకు చెబితే అవకాశాలు రాకుండా చేయడమే కాకుండా సహాయకురాలిగా కూడా తీసేస్తానని ఆమెను బెదిరించాడు. దాంతో ఆమె మౌనం వహించింది. దాన్ని అవకాశంగా తీసుకుని ఆమెను షూటింగులకు తీసుకెళ్లినప్పుడల్లా ఆమెపై అత్యాచారం చేసేవాడు. వ్యానిటీ వ్యానులో సైతం ఆమెపై అఘాయిత్యం చేసేవాడు. ఈ వేధింపులను తట్టుకోలేని బాధితురాలు ఇంటికే పరిమితమయ్యింది. కానీ ఆర్థిక సమస్యలు చుట్టుముట్టడంతో తిరిగి షూటింగుల్లో పాల్గొంది. అదే అదనుగా మళ్లీ ఆమెపై జానీ మాస్టర్ వేధింపులకు పాల్పడ్డాడు.
 
మతం మార్చుకుని తనను వివాహం చేసుకోవాలని ఒత్తిడి చేసాడు. దీనితో ఆమె ఇల్లు మారి వేరేచోటకి వెళ్లిపోయింది. ఇది తెలిసిన జానీ మాస్టర్ ఆమెకి అవకాశాలు రాకుండా చేసాడు. దీనిపై బాధితురాలు టీఎఫ్టీడీడీఎకి ఫిర్యాదు చేయడంతో ఆమెకి సొంతగా అవకాశాలు వచ్చేలా చేసారు. ఐనప్పటికీ అతడి నుంచి వేధింపులు కొనసాగుతుండటంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. నిందితుడు జానీ మాస్టర్ అత్యాచారానికి పాల్పడిన సమయంలో బాధితురాలు మైనర్ కావడంతో అతడిపై పోక్సో కేసు పెట్టారు.