బడ్జెట్ రూ.40 కోట్లు.. కలెక్షన్లు రూ.210+ కోట్లు : 'మహవతార్ నరసింహా' ఉగ్రరూపం!!
హోంబాలే నిర్మాణ సంస్థ తెరకెక్కించిన చిత్రం మహవతార్ నరసింహా. గత నె 25వ తేదీన ఈ చిత్రం విడుదలైంది. ఈ ఆధ్యాత్మిక యానిమేషన్ చిత్రం ఎవరూ ఊహించని విధంగా బాక్సాఫీస్ వద్ద ఉగ్రరూపం దాల్చింది. ఫలితంగా కనకవర్షం కురిపిస్తోంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా రూ.210 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టింది.
సినిమా విజయంపై దర్శకుడు అశ్విన్ కుమార్ ఆనందం వ్యక్తం చేశారు. సోమవారం పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. "దేశంలో యానిమేషన్ అంటే చిన్నారులకు సంబంధించిన విషయంగా పరిగణిస్తారు. మేం ఆ మైండ్‌సెట్‌ను మార్చాం. మరిన్ని యానిమేషన్ చిత్రాలు వస్తాయని అనుకుంటున్నా. యానిమేషన్ పవర్ఫుల్ మీడియం అని ఫిల్మ్ మేకర్స్ గుర్తించాలి. లైవ్ యాక్షన్‌లాగే యానిమేషన్‌నూ నిర్మాతలు సీరియస్‌గా తీసుకునేలా 'మహావతార్ నరసింహ' చేస్తుందని ఆశిస్తున్నా. 'మహావతార్ నరసింహ' లాంటి కథలకు యానిమేషనే సరైన ఎంపిక. కంటెంట్ బలంగా ఉంటే స్టార్ నటులు లేకపోయినా ప్రేక్షకులు సినిమాలు చూసేందుకు వస్తారు" అని పేర్కొన్నారు.
అలాగే, 'మహావతార్ నరసింహ' బడ్జెట్‌పై జరిగిన ప్రచారంపై అశ్విన్ స్పందించారు. ప్రమోషన్స్‌తో కలిపి దాదాపు రూ.40 కోట్లు ఖర్చయిందని క్లారిటీ ఇచ్చారు. అయితే, ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ.210 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది.