బాలీవుడ్‌లో చిరునవ్వుల నటుడు అస్రానీ ఇకలేరు
బాలీవుడ్ చిత్రపరిశ్రమలో చిరునవ్వు నటుడుగా గుర్తింపు పొందిన గోవర్థన్ అస్రానీ ఇకలేరు. ఆయనకు వయసు 84 యేళ్లు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన ఆయనను నాలుగు రోజుల క్రితం కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చేర్చగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం సాయంత్రం తుదిశ్వాస విడిచినట్టు కుటుంబ సభ్యులు వెల్లడించారు. అస్రానీ మృతి పట్ల పలువురు బాలీవుడ్ సినీ ప్రముఖులు, సహచరులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా తమ సంపాతం, సానుభూతిని తెలిపారు.
కాగా, గత 1941లో రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూరులో జన్మించిన అస్రాని.. ప్రారంభంలో ఆల్ ఇండియా రేడియోలో వాయిస్ ఆర్టిస్టుగా పనిచేశారు. అదే సమయంలో తన విద్యను పూర్తి చేశారు. నటనపై ఉన్న ఆసక్తితో 1962లో ముంబైకి వెళ్లారు. అక్కడ దర్శకులు కిశోర్ సాహు, హృషికేశ్ ముఖర్జీ సలహా మేరకు పుణెలోని ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌లో చేరారు.
1966లో విడుదలైన 'హమ్ కహా జా రహే హై'సినిమాతో వెండితెరపై తొలి అడుగుపెట్టిన ఆయన, 1967లో వచ్చిన 'హరే కాంచ్ కీ చూడియా'తో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే, 'షోలే' సినిమాలో ఆయన పోషించిన జైలర్ పాత్ర ఆయనకు విశేషమైన పేరు తెచ్చిపెట్టింది.
సుదీర్ఘ సినీ ప్రస్థానంలో అస్రాని 350కిపైగా సినిమాల్లో నటించి ప్రేక్షకులను అలరించారు. 'హీరో హిందూస్థానీ', 'డ్రీమ్ గర్ల్ 2' వంటి చిత్రాల్లో కూడా ఆయన గుర్తుండిపోయే పాత్రలు పోషించారు. అంతేకాకుండా 'చలా మురారీ హీరో బన్నే', 'ఉడాన్' వంటి సినిమాలకు దర్శకత్వం వహించి తన ప్రతిభను చాటుకున్నారు.