శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 30 అక్టోబరు 2024 (15:26 IST)

లక్కీ భాస్కర్ ప్రీమియర్ల ఆదరణతో షోలు కూడా పెంచాము : నిర్మాత సూర్యదేవర నాగవంశీ

Naga vamsi
Naga vamsi
సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ "లక్కీ భాస్కర్" అనే మరో వైవిధ్యమైన చిత్రంతో అలరించడానికి సిద్ధమైంది. దేశవ్యాప్తంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రానికి ప్రతిభగల దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వం వహించారు. మీనాక్షి చౌదరి కథానాయిక. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్‌ఫోర్ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రానికి నిర్మాతలు. జి.వి. ప్రకాష్ కుమార్ సంగీత దర్శకుడు. 
 
దీపావళి కానుకగా అక్టోబర్ 31వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానుంది. తెలుగునాట ఒకరోజు ముందుగానే, అనగా అక్టోబర్ 30వ తేదీ సాయంత్రం నుంచే ప్రీమియర్ షోలు ప్రదర్శితమవుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా మీడియాతో ముచ్చటించిన నిర్మాత సూర్యదేవర నాగవంశీ, ఈ చిత్ర విశేషాలను పంచుకున్నారు.
 
- విడుదలకు ముందే లక్కీ భాస్కర్ పై ఈస్థాయి అంచనాలు ఏర్పడటం సంతోషంగా ఉంది. కొన్ని సినిమాలు మంచి సినిమా చేశామనే సంతృప్తిని కలిగిస్తాయి. అలాంటి సంతృప్తిని 'లక్కీ భాస్కర్' కలిగించింది. ఈ సినిమాపై ఎంతో నమ్మకంగా ఉన్నాము. అందుకే ప్రీమియర్ షోలు వేయాలని నిర్ణయించాము. ప్రీమియర్లకు మంచి స్పందన వస్తుండటంతో, షోల సంఖ్య కూడా పెంచాము.
 
- సినిమాకి టాక్ బాగా వస్తుందన్న నమ్మకంతోనే ప్రీమియర్లు వేస్తున్నాం. టాక్ బాగా వస్తే, రేపు సినిమా చూసేవారి సంఖ్య మరింత పెరుగుతుంది. దాంతో మొదటిరోజు వసూళ్లు భారీగా వచ్చే అవకాశముంది.
 
- జయాపజయాలతో సంబంధం లేకుండా కొందరితో మంచి అనుబంధం ఏర్పడుతుంది. ఆ అనుబంధంతో సినీ ప్రయాణం కొనసాగుతుంది. దర్శకుడిగా వెంకీ అట్లూరిని మేము నమ్మాము. అందుకే ఆయనతో వరుస సినిమాలు చేస్తున్నాము.
 
- మనిషి డబ్బు సంపాదించాలనుకున్నప్పుడు ఎంత దూరమైనా వెళ్తాడు అనే కథాంశంతో ఈ చిత్రం రూపొందింది. బ్యాంకింగ్ నేపథ్యంలో థ్రిల్లర్ జానర్ లో ఉండే ఫ్యామిలీ సినిమా ఇది. తర్వాత ఏం జరుగుతుందోననే ఆసక్తిని రేకెత్తిస్తూ నడుస్తుంది. ఒక కొత్త ప్రపంచంలోకి వెళ్లినట్టు ఉంటుంది. సినిమా ప్రారంభమైన పది పదిహేను నిమిషాలకు ప్రేక్షకులు భాస్కర్ పాత్రతో కలిసి ప్రయాణిస్తారు. భాస్కర్ అనే వ్యక్తి యొక్క జీవితం చుట్టూనే ప్రధానంగా ఉంటుంది ఈ చిత్రం.
 
- సినిమా చూస్తున్న ప్రతి ప్రేక్షకుడు భాస్కర్ గెలవాలని కోరుకుంటాడు. చూసే సాధారణ ప్రేక్షకులు భాస్కర్ పాత్రలో తమని తాము చూసుకుంటారు. కథానాయకుడు ఈ సినిమాలో ఎవరినీ మోసం చేయడం ఉండదు. తన తెలివి తేటలతోనే ఎదుగుతాడు.
 
- ఇది సందేశాత్మక చిత్రం కాదు. తెలుగులో వస్తున్న ఒక విభిన్న చిత్రం. కమర్షియల్ అంశాలు పుష్కలంగా ఉంటాయి. కమర్షియల్ సినిమా అంటే ఫైట్స్ ఒకటే కాదు. ఫైట్స్ లేకుండానే ప్రేక్షకులను మెప్పించే అంశాలు ఈ సినిమాలో ఎన్నో ఉన్నాయి. ఎక్కడా బోర్ కొట్టకుండా సినిమా నడుస్తుంది. సినిమా చూసి, ఒక మంచి అనుభూతితో ప్రేక్షకులు థియేటర్ నుంచి బయటకు వస్తారు.
 
- ఎడిటర్ నవీన్ నూలి ఏ సినిమా చూసి అంత తేలికగా సంతృప్తి చెందడు. అలాంటి నవీన్ సినిమా బాగుంది చూడమని చెప్పాడు. నాకు, త్రివిక్రమ్ గారితో సహా మా అందరికీ సినిమా బాగా నచ్చింది. అందరం సినిమా పట్ల ఎంతో నమ్మకంగా ఉన్నాం.
 
- అందరికీ దీపావళి శుభాకాంక్షలు. లక్కీ భాస్కర్ సినిమా చూసి కుటుంబంతో కలిసి దీపావళి సెలబ్రేట్ చేసుకోండి. అలాగే ఈ దీపావళికి విడుదలవుతున్న ఇతర సినిమాలు కూడా విజయం సాధించాలని కోరుకుంటున్నాను.