సోమవారం, 3 నవంబరు 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 15 సెప్టెంబరు 2025 (16:13 IST)

థియేటర్‌లో కూడా ఆఫీసు పనిలో నిమగ్నమైన యువతి... నెటిజన్ల ఫైర్

woman work - theater
వినోదం కోసం సినిమా చూసేందుకు వెళ్లిన ఓ యువతి థియేటర్ కూడా ల్యాప్‌టాప్‌లో వర్క్ చేస్తున్న దృశ్యం కనిపించింది. దీన్ని ఎవరో ఫోటో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. అంతే.. ఈ ఫోటో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. కార్పొరేట్ పని ఒత్తిడికి నిదర్శనమంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగుల వ్యక్తిగత సమయాన్ని గౌరవించాలంటూ వారు హితవు పలుకుతున్నారు. ఈ దృశ్యం ఐటీ నగరం బెంగుళూరులో కనిపించింది. ఈ ఫోటో ఇపుడు ఐటీ ప్రపంచంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. నగరంలోని కార్పొరేట్ వర్క్ కల్చర్‌పై తీవ్రమైన చర్చకు దారితీసింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, ఇటీవల ఓ వ్యక్తి "లోకా" సినిమాను చూసేందుకు బెంగుళూరులోని ఓ థియేటర్‌కు వెళ్లారు. తన ముందువరుసలో కూర్చొనివున్న ఓ యువతి ల్యాప్‌టాప్ ఓపెన్ చేసి తీవ్రంగా పని చేస్తుండటం గమనించి, ఆ దృశ్యాన్ని ఫోటో తీసి రెడిట్ అనే సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌లో పోస్ట్ చేశాడు. బెంగుళూరులో ఉద్యోగుల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో చెప్పడానికి ఇదే నిదర్శనం అంటూ క్యాప్షన్ జోడించారు. 
 
ఈ ఫోటో పోస్ట్ చేసిన కొన్ని క్షణాల్లోనే వైరల్‌గా మారింది. నెటిజన్లు దీనిపై ఆగ్రహంతో స్పందించారు. కొన్ని ఐటీ, కార్పొరేట్ కంపెనీలు ఉద్యోగులను బానిసల్లా చూస్తున్నాయని, వారి వ్యక్తిగత జీవితాన్ని కూడా హరిస్తున్నాయని మండిపడుతున్నారు. ఇది "వర్క్ ఫ్రమ్ హోం కాదు.. వర్క్ ఫ్రమ్ థియేటర్‌"లా ఉంది అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 
 
ఒక యువతి తన వినోదం కోసం కేటాయించిన సమయంలో కూడా పని చేయాల్సి రావడం పని ఒత్తిడికి పరాకాష్ట అని పలువురు అభిప్రాయపడుతున్నారు. కంపెనీలు తమ వైఖరిని మార్చుకుని, ఉద్యోగుల వ్యక్తిగత సమయానికి విలువ ఇవ్వాలంటూ వారు సూచిస్తున్నారు. కార్పొరేట్ కంపెనీల్లో నెలకొన్న పని ఒత్తిడికి ఈ ఫోటో అద్దం పడుతుందని మరికొందరు నెటిజన్లు కామెంట్స్ చేశారు.