కడపలో వైకాపా రూల్ : వైకాపా కార్యకర్తలపై కేసు పెట్టారని సీఐపై బదిలీవేటు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ సారథ్యంలోని టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఒక యేడాది ముగిసిపోయింది. కానీ, కడపలో మాత్రం ఇంకా వైకాపా పాలనే సాగుతోంది. గత వైకాపా పాలనలో కడప జిల్లా వ్యాప్తంగా వైకాపా సానుభూతిపరులు కీలక పోస్టుల్లో నియమితులయ్యారు. ప్రభుత్వం మారినప్పటికీ వారు ఆ పోస్టుల్లో స్వేచ్ఛగా కొనసాగుతున్నారు. వీరంతా కలిసి జిల్లాలోని వైకాపా కార్యకర్తలపై ఈగ వాలనివ్వడం లేదు. పొరపాటున వైకాపా కార్యకర్తలపై కేసు పెడితే మాత్రం ఆ అధికారి తక్షణం బదిలైపోతున్నాడు. తాజాగా కడప ఒకటో పట్టణ పోలీస్ ఇన్‌స్పెక్టర్ రామకృష్ణకు ఇదే పరిస్థితి ఎదురైంది. సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెట్టిన వైకాపా కార్యకర్తలపై కేసు నమోదు చేయడమే ఆయన చేసిన నేరం. జిల్లాలోని వైకాపా సానుభూతి అధికారులు ఆయనను వీఆర్‌కు పంపించారు. ఇది ఇపుడు జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
కడప టీడీపీ ఎమ్మెల్యే ఆర్.మాధవిరెడ్డిపై సామాజిక మాధ్యమాల్లో ఇటీవల పెద్ద ఎత్తున అసభ్య పోస్టులు పెట్టారు. వైకాపా నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా, ఆయన సోదరుడు అహ్మద్ బాషా, పీఏ ఖాజా.. దీని వెనుక ఉన్నారంటూ ఎమ్మెల్యే మాధవిరెడ్డి, ఆమె భర్త, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులు రెడ్డి ఇటీవల కడప ఒకటో పట్టణ పోలీసులకు ఆధారాలతో ఫిర్యాదు చేశారు.
దీంతో కడప ఒకటో పట్టణ సీఐ రామకృష్ణ యాదవ్ ఆ ముగ్గురిపైనా సోమవారం కేసు నమోదు చేశారు. అలా కేసు నమోదైందో లేదో.. గంటల వ్యవధిలో ఆ సీఐను వీఆర్‌లోకి పంపిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీనిపై టీడీపీ వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. తప్పు చేసిన వారిపై కేసు పెట్టిన అధికారిని ప్రోత్సహించాల్సింది పోయి వీఆర్‌లోకి పంపించటమేంటని ప్రశ్నిస్తున్నాయి.
మరోవైపు, మాధవిరెడ్డి ఫిర్యాదుపై నమోదు చేసిన కేసులో వైకాపా నేత అంజాద్ బాషా పీఏ ఖాజా ఒక్కరినే నిందితుడిగా చేర్చకుండా.. అంజాద్ బాషా, ఆయన సోదరుడు అహ్మద్ బాషాలను ఎందుకు నిందితులుగా చేర్చావంటూ ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ సీఐను ప్రశ్నించినట్లు, తన మాట విననందుకు వీఆర్‌కు పంపించినట్లు టీడీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ అంశంపై ఎస్పీ నచికేత్ విశ్వనాథ్‌ను అడగ్గా క్రమశిక్షణ ఉల్లంఘించినందుకే సీఐపై తాత్కాలిక చర్యలు తీసుకున్నామని తెలిపారు.