శుక్రవారం, 3 అక్టోబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 17 సెప్టెంబరు 2025 (10:39 IST)

అక్రమ వలసదారులపై కేంద్రం ఉక్కుపాదం... స్వదేశాలకు పంపించేందుకు ప్రణాళికలు

crime
దేశంలోని అక్రమంగా ప్రవేశించిన వారిపై కేంద్రం ఉక్కుపాదం మోపుతోంది. అక్రమ వలసదారులను గుర్తించి వారిని ఏరివేసే చర్యల్లో నిమగ్నమైంది. ఇప్పటికే 16 వేల మంది వలసదారులను గుర్తించగా, వారిని వారి వారి స్వదేశాలకు పంపించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. వీరి బహిష్కరణ ప్రక్రియను స్వయంగా కేంద్ర హోం శాఖ పర్యవేక్షిస్తోంది. 
 
అధికార వర్గాల సమాచారం ప్రకారం, బహిష్కరణకు గురికానున్న వారిలో చాలా మందికి మాదకద్రవ్యాల సరఫరా, ఇతర క్రిమినల్ కార్యకలాపాలతో సంబంధాలు ఉన్నట్లు తేలింది. ఈ నేపథ్యంలో నార్కోటిక్స్ కంట్రోల్ బోర్డు (ఎన్సీబీ) వీరిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతోంది. వ్యవస్థీకృత నేరాలను అరికట్టే దీర్ఘకాలిక వ్యూహంలో భాగంగా తొలుత నేర చరిత్ర ఉన్న అక్రమ వలసదారులను దేశం నుంచి పంపించివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
 
ఇటీవల అమల్లోకి వచ్చిన 'వలసలు, విదేశీయుల చట్టం-2025' ఈ చర్యలకు చట్టపరమైన బలాన్ని చేకూరుస్తోంది. సెప్టెంబరు 2 నుంచి అమల్లోకి వచ్చిన ఈ నూతన చట్టం ప్రకారం, తప్పుడు పత్రాలతో దేశంలోకి అక్రమంగా ప్రవేశించిన వారికి కఠిన శిక్షలు ఎదురుకానున్నాయి. దోషులుగా తేలిన వారికి 2 నుంచి 7 సంవత్సరాల వరకు జైలు శిక్షతో పాటు రూ.లక్ష నుంచి రూ.10 లక్షల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది.
 
ఈ బహిష్కరణ ప్రక్రియను సజావుగా పూర్తి చేసేందుకు కేంద్ర హోం శాఖ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదింపులు జరుపుతోంది. కాగా, అక్రమంగా దేశంలో నివసిస్తున్న వీరిలో కొందరు ప్రభుత్వ సంక్షేమ పథకాలను కూడా పొందుతున్నారని, దీనివల్ల అర్హులైన పేదలకు అన్యాయం జరుగుతోందని అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే బహిష్కరణ ప్రక్రియను వేగవంతం చేయాలని కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తోంది.